Share News

USA: భారత్ తెలివిగా ఆలోచిస్తోంది.. నిక్కీ హేలి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:08 AM

అమెరికా(America)తో భాగస్వామిగా ఉండాలని భారత్‌ కోరుకుంటోందని, అయితే ప్రస్తుతానికి అమెరికా అగ్రరాజ్యంగా నాయకత్వం వహించడంపై వారికి విశ్వాసం లేదని రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ(Nikki Haley) బుధవారం అన్నారు.

USA: భారత్ తెలివిగా ఆలోచిస్తోంది.. నిక్కీ హేలి ఆసక్తికర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా(America)తో భాగస్వామిగా ఉండాలని భారత్‌ కోరుకుంటోందని, అయితే ప్రస్తుతానికి అమెరికా అగ్రరాజ్యంగా నాయకత్వం వహించడంపై వారికి విశ్వాసం లేదని రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ(Nikki Haley) బుధవారం అన్నారు. యూఎస్‌లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భారత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అమెరికాపై నమ్మకం లేకున్నా.. రష్యాతో సన్నిహితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తెలివిగా మసులుకుంటోందని పేర్కొన్నారు.

హేలీ ఐక్యరాజ్యసమితికి US శాశ్వత ప్రతినిధిగా ఉన్నప్పుడు 2018లో ఆమె భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ(PM Modi)ని కలిశారు. తీవ్రవాదాన్ని నిరోధించడానికి భారత్-అమెరికా సహకారాన్ని పెంపొందించే మార్గాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించుకునే మార్గాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.


సంబంధాలు బలపరచుకోవాలి..

"నేను యూఎస్ తరఫున భారత వ్యవహార బాధ్యతలు నిర్వర్తించాను. ప్రధాని మోదీతో చర్చించాను. వారు అమెరికాతో భాగస్వామ్యం కావాలని కోరకున్నా.. వారికి అగ్రరాజ్య నాయకత్వంపై నమ్మకం లేదు. యూఎస్ చాలా బలహీనంగా ఉందనుకుంటున్నారు. అందుకే ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఆ దేశం తెలివిగా ఆలోచిస్తోంది. భారత్‌కు ఎక్కువగా ఆయుధాలు అందించే రష్యాతో సన్నిహితంగా ఉంటోంది. అమెరికా ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వాటికితోడు భాగస్వామ్య దేశాలతో కూడా సంబంధాలు బలపరచుకోవాలి. అలా జరిగినప్పుడే మిత్రదేశాలైన ఇజ్రాయెల్, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాలు మా వెంట నడుస్తాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక స్థితి బాగలేదు. అక్కడి నియంతృత్వ ప్రభుత్వ వైఖరిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అమెరికాతో యుద్ధాన్ని కోరుకోవడం చైనా చేస్తున్న పెద్ద తప్పు" అని హేలీ అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2024 | 11:08 AM