Share News

China–India relations: భారత్, చైనా మధ్య ఫ్రెండ్సిప్.. రేపు స్వీట్లు పంచుకోనున్న ఇరు దేశాల సైనికులు

ABN , Publish Date - Oct 30 , 2024 | 08:44 PM

తూర్పు లడఖ్‌‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. ఈ విషయాన్ని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ పెట్రోలింగ్ త్వరలో పున: ప్రారంభమవుతుందని సైనిక అధికారులు..

China–India relations: భారత్, చైనా మధ్య ఫ్రెండ్సిప్.. రేపు స్వీట్లు పంచుకోనున్న ఇరు దేశాల సైనికులు

నిత్యం ఉద్రిక్తత పరిస్థితులు ఉండే భారత్, చైనా సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత తగ్గినట్లు తెలుస్తోంది. భారత్, చైనా సరిహద్దుల ప్రాంతం లడక్ వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం తొలగిపోయింది. తూర్పు లడఖ్‌‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. ఈ విషయాన్ని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ పెట్రోలింగ్ త్వరలో పున: ప్రారంభమవుతుందని సైనిక అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ విధివిధానాలను రూపొందించేందుకు క్షేత్రస్థాయి కమాండర్లు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన ధృవీకరణపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పెట్రోలింగ్ విధివిధానాలు గ్రౌండ్ కమాండర్ల మధ్య జరిగే చర్చల్లో నిర్ణయిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బ్రిగేడియర్, అంతకంటే తక్కువస్థాయి గల ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయిస్తారని సైనిక వర్గాలు వెల్లడించారు. ఇరు దేశాలు తమ భూభాగంలో నిర్వహించే పెట్రోలింగ్ రెండు దేశాల సమన్వయంతోనే ఉంటుందని సైనికాధికారులు తెలిపారు. 20 మంది సైనికులతో బృందాలుగా సాధారణ పెట్రోలింగ్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. ముఖాముఖి, ఘర్షణలు, ఎల్‌ఎసి స్టాండ్‌ఆఫ్‌లను నివారించడానికి ఉభయ దేశాలు అంగీకరించిన విధానాల ప్రకారం పెట్రోలింగ్ విధివిధానాలు నిర్ణయిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో దీపావళి పురస్కరించుకుని రెండు దేశాల సరిహద్దు సమావేశాల ప్రదేశాల్లో మిఠాయిలు పంచుకోవాలని సైనికాధికారులు నిర్ణయించారు.


ఇటీవల కుదిరిన ఒప్పందం

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు తమ బలగాలను తూర్పు లడఖ్ నుంచి ఉపసంహరించుకున్నాయి. దేప్‌సాంగ్, డెమ్‌చౌక్లో రెండు దేశాలకు సంబంధించి జవాన్ల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తైంది. దీంతో డెమ్‌చౌక్‌లో రెండు వైపుల నుంచి అనేక టెంట్లు ఇప్పటికే తొలగించారు. భారత్, చైనా దళాలు వారి స్థానాలు, మౌలిక సదుపాయాల తొలగింపును పరస్పరం ధృవీకరించుకుంటున్నాయి. అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వద్ద ఏప్రిల్ 2020కి ముందున్న యథాతథ స్థితిని పునరుద్ధరించాలని రెండు దేశాలు అంగీకరానికి వచ్చాయి.


గతంలో..

తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్పటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు నుంచి కూడా పలువురు సైనికులు మరణించారు. తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్లినప్పటికీ, రెండు పొరుగుదేశాల మధ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొన్ని వారులుగా భారత్-చైనా మధ్య చర్చలు జరుగాయి. రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 30 , 2024 | 08:44 PM