Share News

పశ్చిమాసియాకు బీ52 విమానాలు

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:06 AM

అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్‌ జెట్లు, బాలిస్టిక్‌ క్షిపణులు, ట్యాంకర్‌ ఎయిర్‌క్రా‌ఫ్ట్‌లను కూడా తరలించింది.

పశ్చిమాసియాకు బీ52 విమానాలు

  • ఖమేనీ హెచ్చరికలతో అమెరికా స్పందన

  • ఫైటర్‌ జెట్లు, బాలిస్టిక్‌ క్షిపణులు, ట్యాంకర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా

  • ఇజ్రాయెల్‌, అమెరికాలను వణికిస్తాం

  • అణు విధానాన్ని పునఃపరిశీలిస్తాం: ఇరాన్‌

టెల్‌అవీవ్‌, టెహ్రాన్‌, నవంబరు 3: అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్‌ జెట్లు, బాలిస్టిక్‌ క్షిపణులు, ట్యాంకర్‌ ఎయిర్‌క్రా‌ఫ్ట్‌లను కూడా తరలించింది. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ కోసం థాడ్‌ వ్యవస్థను మోహరించింది. యూఎస్ఎస్‌ అబ్రహం లింకన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను కూడా అరేబియా సముద్రంలో నిలిపినట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు, అమెరికా భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించిన నేపథ్యంలో తమ అణు విధానాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సలహాదారు కమల్‌ ఖర్రాజీ ప్రకటన చేశారు. తమకు అణ్వాయుధాలు తయారు చేయగల సామర్థ్యం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

  • ఖమేనీ వార్నింగ్‌

ఇజ్రాయెల్‌, అమెరికాలకు పళ్లు విరిగేలా గట్టిగా బదులిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. శతృవులు జియోనిస్టులైనా, అమెరికా అయినా ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు తగిన ఫలితం అనుభవిస్తారని, కోలుకోలేని విధంగా దెబ్బకొడతామన్నారు. టెహ్రాన్‌లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఇందుకు ఇరాన్‌ పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. రాజకీయంగానే కాక సైనిక పరంగా కూడా ఇరాన్‌ పూర్తి సంసిద్ధంగా ఉందని ఖమేనీ స్పష్టం చేశారు. కాగా, గాజాతో పాటు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో 23 మంది చనిపోయారు. లెబనాన్‌లో హెజ్‌బొల్లా సీనియర్‌ ఆపరేటివ్‌ను ఇజ్రాయెల్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనిపై లెబనాన్‌ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది.

Untitled-1 copy.jpg

Updated Date - Nov 04 , 2024 | 03:06 AM