Share News

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 43 మంది దుర్మరణం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:26 AM

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు జరిపింది. వేర్వేరు ఘటనల్లో 43 మంది దుర్మరణం పాలయ్యారు.

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 43 మంది దుర్మరణం

కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిలో 20 మంది హతం

వైద్యులు సహా 240 మందిని బంధించిన ఐడీఎఫ్‌

టెల్‌అవీవ్‌, డిసెంబరు 29: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు జరిపింది. వేర్వేరు ఘటనల్లో 43 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర గాజాలోని హమాస్‌ చిట్టచివరి కమాండ్‌ కంట్రోల్‌గా భావిస్తున్న కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) ముప్పేట దాడి చేసింది. 20 మంది హమాస్‌ ఫైటర్లను హతమార్చి, వైద్యులు, వైద్య సిబ్బంది సహా.. 240 మందిని నిర్బంధించింది. బందీల్లో ఆస్పత్రి డైరెక్టర్‌ అబూ సాఫియా కూడా ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కళ్లకు గంతలు కట్టి.. ఆస్పత్రి ప్రాంగణంలో వేరుగా కూర్చోబెట్టడం, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని అర్ధనగ్నంగా ఒకచోట పెడరెక్కలు విరిచికట్టి కూర్చోబెట్టిన వీడియోలు, ఫొటోలను ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ ‘యెదియోత్‌ అహ్రోనోత్‌’ ఆదివారం ప్రచురించింది. హమా్‌సకు చెందిన అతిపెద్ద కమాండ్‌ కంట్రోల్‌ ఆ ఆస్పత్రిలోనే ఉందని, అక్కడి నుంచే ఇజ్రాయెల్‌ బలగాలపై పోరుకు వ్యూహ రచనలు జరుగుతున్నాయని ఐడీఎఫ్‌ ఆరోపించింది. ‘‘తాజాగా పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన వారు కూడా ఉన్నారు. ఎక్కువ మంది బందీలను షకీద్‌ బెటాలియన్‌కు చెందిన హమాస్‌ ఫైటర్లుగా గుర్తించాం’’ అని ఐడీఎఫ్‌ తన అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో ప్రకటించింది. అదే సమయంలో ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజమైన రోగులను ఐడీఎఫ్‌ 401 బ్రిగేడ్‌ కమాండర్లు ఇండోనేషియా ఆస్పత్రికి సురక్షితంగా తరలించినట్లు పేర్కొంది. కాగా.. అమాయకులను ఐడీఎఫ్‌ నిర్బంధించిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ ఘటనపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. ఉత్తర గాజాలోని జబాలియా, హోనస్‌, లాహియాల్లో ఆదివారం కూడా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. నుసేరియస్‌ శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో 9 మంది మృతిచెందారని పాలస్తీనా న్యూస్‌ ఏజెన్సీ ‘వఫా’ వెల్లడించింది. బెయిట్‌ హనూన్‌ శిబిరంలో ఏడుగురు పాలస్తీనీయులు.. సెంట్రల్‌ గాజాలోని అల్‌-వఫా ఆస్పత్రిపై ఐడీఎఫ్‌ జరిపిన షెల్లింగ్‌లో ఏడుగురు మృతిచెందినట్లు తెలిపింది. అటు.. సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడుల్లో ఆరుగురు మృతిచెందారు.

Updated Date - Dec 30 , 2024 | 04:26 AM