Lebanon Pager explosions 2024: లెబనాన్ పేజర్ల పేలుళ్ల కేసుతో కేరళ వ్యక్తికి లింకులు
ABN , Publish Date - Sep 21 , 2024 | 01:52 PM
గత ఏడాది ఇజ్రాయిల్ ప్రజలు తమ పండుగ వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడి సృష్టించిన మారణహోమాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు.దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ చేపట్టిన..
లెబనాన్‌లో ఏక కాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందిన ఘటన విశ్వ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో వేలమంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయిల్ దేశ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. పేజర్లు పేలిన ఘటన నుంచి తేరుకోక ముందే వాకీటాకీలు సైతం ఏకకాలంలో పేలడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. దేశం కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా గ్రూపు ఈ వరుస దాడులతో ఖంగుతిన్నది. ఇజ్రాయిల్ – లెబనాన్ (హెజ్బొల్లా) మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత సమయంలో పేజర్లు పేల్చి శత్రువులను దెబ్బతీయడం ప్రపంచంలో మొదటిసారిగా చోటుచేసుకుంది. గత ఏడాది ఇజ్రాయిల్ ప్రజలు తమ పండుగ వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడి సృష్టించిన మారణహోమాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు.దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్స్ అంతకు మించిన మారణహోమాన్ని సృష్టించాయి. గాజాలోని హమాస్ సంస్థకు భావసారూప్యత కల్గిన ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హమాస్ తరహాలోనే లెబనాన్‌లో కూడా సాయుధ ఇస్లామిక్ గ్రూపు హెజ్బొల్లా పనిచేస్తోంది. ఈ సంస్థకు ఉన్న సైనిక సంపత్తి ఒక చిన్న దేశం సైన్యంతో సమానం. ఇప్పుడు ఈ సంస్థ కూడా ఇజ్రాయిల్‌పై ఆయుధాలు ఎక్కుపెట్టి. వరుస దాడులకు తెగబడింది.
పేజర్లు ఈ సంస్థవే
ఏకకాలంలో పేలిన పేజర్లు గోల్డ్ అపోలో సంస్థకు చెందిన ఎఆర్-924 మోడల్ పేజర్లు. తైవాన్ దేశానికి చెందిన గోల్డ్ అపోలో సంస్థ తమ ట్రేడ్‌మార్క్ లైసెన్సును ఉపయోగించుకునే అవకాశాన్ని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థ AR-924 మోడల్ పేజర్లను తయారు చేసింది. వాటిని బల్గేరియా రాజధాని సోఫియా కేంద్రంగా పనిచేస్తున్న నోర్టా గ్లోబల్ సంస్థ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై బల్గేరియా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయ. లెబనాన్‌లో పేలిన పేజర్ల తయారీ, ఎగుమతిలో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశం ప్రకటించింది. అయితే నోర్టా గ్లోబల్ సంస్థ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది.
కేరళ వ్యక్తి పాత్ర
పేజర్ల పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బల్గేరియా రాజధాని సోఫియాలో నోర్టా గ్లోబల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి కేరళలోని వాయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్‌గా గుర్తించారు. లెబనాన్‌కు సరఫరా చేసిన పేజర్లలో పేలుడు పదార్థాలతో పాటు బ్యాటరీని వెడెక్కించేలా మాల్‌వేర్, స్పైవేర్ అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఏకకాలంలో అన్ని పేజర్లను పేల్చడం సాధ్యపడినట్లు తెలుస్తోంది. లెబనాన్‌కు చేరిన పేజర్లను సరఫరా చేసిన సంస్థ కేరళ వాసిది కావడంతో ఈ పేలుళ్ల వెనుక ఆయన పాత్ర ఏమిటనేదానిపై దర్యాప్తు జరగనుంది. ప్రస్తుతం నార్వే పౌరసత్వం తీసుకుని ఆ దేశంలోనే స్థిరపడ్డ రిన్సన్ జోస్ గురించి అటు నార్వే, ఇటు బల్గేరియా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నోర్టా గ్లోబల్ సంస్థ తమ కన్సల్టింగ్ కార్యాకలాపాల ద్వారా యూరప్ బయట గత ఏడాది 7,25,000 డాలర్ల ఆదాయం సమకూర్చినట్టు పేర్కొంది. రిన్సన్ జోస్ ఉన్నత చదువుల కోసం కేరళ వీడి నార్వే వెళ్లినట్టు తెలుస్తోంది. చదువు పూర్తయ్యాక కొంత కాలం యూకే రాజధాని లండన్‌లో ఉద్యోగం చేసి, మళ్లీ తిరిగి నార్వే రాజధాని ఓస్లోకి వెళ్లిపోయాడు. నార్వే ప్రెస్ గ్రూప్ డీఎన్ మీడియాలో డిజిటల్ కస్టమర్ సపోర్ట్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. నార్వేలోనే పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. జోస్ కవల సోదరుడు లండన్‌లో ఉంటున్నాడు. అయితే పేజర్ల పేలుడు ఘటన తర్వాత నుంచి జోస్ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. కేరళలో పుట్టి నార్వేలో సెటిలైన రిన్సన్ జోస్ ప్రస్తుతం లెబనాన్‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latestc Telugu News Click Here