Share News

China: పట్టపగలే చీకటిగా మారిన చైనాలోని రాష్ట్రం.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Feb 20 , 2024 | 07:35 PM

మీరెప్పుడైనా ఓ ప్రాంతం పట్టపగలే చీకటిగా మారడం చూశారా? చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకు కారణం.. ఇసుక తుఫాన్. ఈ తుఫాన్ కారణంగా ఆకాశం, వాతావరణం మొత్తం ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. కనీసం 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంత తీవ్రంగా ఇది కమ్మేసింది.

China: పట్టపగలే చీకటిగా మారిన చైనాలోని రాష్ట్రం.. ఎందుకో తెలుసా?

మీరెప్పుడైనా ఓ ప్రాంతం పట్టపగలే చీకటిగా మారడం చూశారా? చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకు కారణం.. ఇసుక తుఫాన్. ఈ తుఫాన్ కారణంగా ఆకాశం, వాతావరణం మొత్తం ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. కనీసం 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంత తీవ్రంగా ఇది కమ్మేసింది. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, ప్రజల భద్రత కోసం అత్యవసర ట్రాఫిక్ చర్యలను అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.


బలమైన గాలులతో కూడిన ఇసుక తుఫాన్ వస్తుందని చైనా వాతావరణ శాఖ ఇంతకుముందే ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. అయితే.. ఈ తుఫాన్ మరీ ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. వాతావరణం ఆరెంజ్ రంగులోకి మారిందంటే.. పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ తుఫాన్ ఫిబ్రవరి 22 వరకు ఉంటుందని.. ఉష్ణోగ్రత తగ్గుదల అత్యంత విపరీతంగా ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. స్థానిక మీడియా ప్రకారం.. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని టుర్పాన్‌ నగరంలో ఈ ఇసుక తుఫాన్ దెబ్బకు రహదారులపై చీకటి అలుముకుందని, దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని తెలిసింది. ఈ దెబ్బకు వేలాదిమంది ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని.. ఎంతో కష్టం మీద వారిని బయటకు తీసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

షింజియాంగ్‌ నగరమే కాదు.. దాని పొరుగున ఉన్న షాక్సీ ప్రావిన్స్‌లోని రాజధాని జియాన్‌తో పాటు ఇతర ప్రాంతాలు సైతం ఈ తుఫాన్‌కు ప్రభావితం అయ్యాయి. ఈ నగరాలన్నీ దుమ్ముతో కప్పబడిపోయాయి. అటు.. గుంసు ప్రావిన్స్‌లోని ఇదే పరిస్థితి ఉండటంతో, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గాను జ్యూకాన్‌ నగరం వద్ద జాతీయ రహదారిని మూసివేశారు. ఫలితంగా.. దాదాపు 40,000 మంది ప్రయాణికులు రోడ్డు పక్కనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇసుక తుపానుకు పొగమంచు తోడు కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ వాతావరణం కారణంగా.. ప్రజలు తీవ్రమైన అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి.

Updated Date - Feb 20 , 2024 | 07:35 PM