Share News

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించిన యూనస్

ABN , Publish Date - Aug 08 , 2024 | 09:20 PM

రిజర్వేషన్ల కోటా కారణంగా చెలరేగిన హింసతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించిన యూనస్
Muhammad Yunus

ఢాకా: రిజర్వేషన్ల కోటా కారణంగా చెలరేగిన హింసతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వానికి సారధిగా నోబెల్ అవార్డ్ గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.


రాజ్యాంగ పరిరక్షణ కోసం తన విధులను నిబద్దతతో చేస్తానని యూనస్ పేర్కొన్నారు. రాజ్యాంగ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.

యూనస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించిన ముహమ్మద్ యూనస్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని భారత్ కోరుకుంటోందని మోదీ అన్నారు. సాధారణ పరిస్థితి నెలకొంటే హిందువులతో పాటు ఇతర మైనారిటీలు భద్రతంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ కొత్త బాధ్యతలు స్వీకరించిన వేళ ఆయనకు నా శుభాకాంక్షలు. హిందువులు, ఇతర అన్ని మైనారిటీ వర్గాల భద్రత, రక్షణకు భరోసానిస్తూ వీలైనంత త్వరగా సాధారణ స్థితికి దేశం చేరుకోవాలని భారత్ ఆశిస్తోంది. ఇరుదేశ ప్రజల శాంతి, భద్రత, పురోగతి సాకారం చేసేందుకుగానూ బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


కాగా 84 ఏళ్ల ముహమ్మద్ యూనస్‌ 2006లో నోబెల్ శాంతి అవార్డును గెలుచుకున్నారు. పేదలకు ఎలాంటి పూచికత్తు లేకుండా సూక్ష్మ రుణాలను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ ఆయన ప్రతిపాదించారు. అంతేకాదు స్వయంగా ‘గ్రామీణ బ్యాంక్’ను ఏర్పాటు చేశారు. ఈ కారణాలతో ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది.

Updated Date - Aug 08 , 2024 | 10:00 PM