Share News

Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..

ABN , Publish Date - Sep 24 , 2024 | 08:41 AM

గోల్కొండ ఘనులు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి ఘనుల్లో లభ్యమైన వందలాది వజ్రాలతో తయారు చేసిన నెక్లెస్‌ను త్వరలో వేలం పాట వేయనున్నారు. వేలాది కోట్ల రూపాయిల్లో ఈ నెక్లెస్ ధర పలుకుతుందని నిర్వాహాకులు వెల్లడిస్తున్నారు.

 Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..

లండన్, సెప్టెంబర్ 24: ప్రపంచవ్యాప్తంగా అత్యంత పురాతనమైన వస్తువులకు విపరీతమైన ఆదరణ ఉంది. ఆ వస్తువులను వేలం వేస్తే.. ఎంత నగదు అయిన చెల్లించి సొంతం చేసుకునే ట్రిలియనీర్లు నేటికి ప్రపంచంలో ఉన్నారు. అదే కోవకు చెందిన శాతాబ్దాల నాటి వందలాది వజ్రాలతో పొదిగిన నెక్లెస్‌ను మరికొద్ది రోజుల్లో వేలం వేసేందుకు నిర్వాహాకులు సిద్దమవుతున్నారు.


18వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న దాదాపు 500 వజ్రాలతో పొదిగిన నెక్లెస్‌ను ఈ ఏడాది నవంబ‌ర్‌ 11వ తేదీన యూరప్‌లోని జెనీవాలో వేలం వేయనున్నట్లు నిర్వాహాకులు సోథెబై జ్యువెలరీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ అండ్రూస్ వైట్ కొరెల్ తెలిపారు. అందుకోసం అక్టోబర్ 25వ తేదీ నుంచి అన్‌లైన్ ద్వారా బిడ్డింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.


వేలం పాటలో ఈ నెక్లెస్ రూ.1.8 నుంచి రూ. 2.8 మిలియన్ డాలర్ల మధ్య ధర పలుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. మూడు వరుసలతో తయారు చేయబడిన ఈ నెక్లెస్ ఇరువైపులా చివరల్లో కూచ్చులుంటాయని పేర్కొన్నారు. వాటిని సైతం వజ్రాలతోనే పొదిగినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్ల అనంతరం ఈ నెక్లెస్‌ను ప్రజలు వీక్షించేందుకు అందుబాటులో ఉంచనున్నామన్నారు.


అయితే ఈ నెక్లెస్ తయారైన నాటి నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ప్రజలు వీక్షించేందుకు అందుబాటులో ఉంచారని వివరించారు. 1937లో ఆరో జార్జీ చక్రవర్తి పట్టాభిషేకం, అలాగే 1953లో రెండవ క్వీన్ ఎలిజబత్ పట్టాభిషేకం సమయాల్లో మాత్రమే ఈ నెక్లెస్ బయటకు తీశారన్నారు.


ఫ్రెంచ్ విప్లవంతోపాటు మేరీ - ఆంటోయినెట్ మరణానికి దోహదపడిన "ఎఫైర్ ఆఫ్ ది నెక్లెస్" కుంభకోణంతో ఈ నెక్లెస్‌లోని వజ్రాలకు సంబంధం ఉండవచ్చనని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే భారత్‌లోని గోల్కొండ ఘనులు వజ్రాలకు అత్యంత ప్రసిద్ధి అని ఆయన గుర్తు చేశారు. ఆ ఘనుల్లో లభ్యమైన వజ్రాలతో ఈ నెక్లెస్ తయారు చేశారని సోథెబై జ్యువెలరీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ అండ్రూస్ వైట్ కొరెల్ వివరించారు. అలాగే లండన్‌లో బుధవారం వరకు ప్రదర్శనలో ఉంచుతామన్నారు. అనంతరం హాంకాంగ్, న్యూయార్క్‌తోపాటు తైవాన్‌ దేశాల్లో ఈ వజ్రాల నెక్లెస్ ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు.

For More International News And Telugu News..

Updated Date - Sep 24 , 2024 | 08:43 AM