అమెరికాలో యూఎ్‌ఫవోల కలకలం
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:13 AM
హాలీవుడ్ సినిమాల తరహాలో.. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పలు కౌంటీల్లో పదే పదే కనిపిస్తున్న మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ) స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి!
ట్రెన్టన్, డిసెంబరు 15: హాలీవుడ్ సినిమాల తరహాలో.. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పలు కౌంటీల్లో పదే పదే కనిపిస్తున్న మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ) స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి! నవంబరు 18 నుంచి తరచుగా కనిపిస్తున్న ఈ యూఏవీలు.. అమెరికా సైన్యం పరీక్షిస్తున్న డ్రోన్లా? విమానాలా? లేక గ్రహాంతరవాసులకు చెందిన గుర్తుతెలియని ఎగిరే వస్తువులా(యూఎ్‌ఫవో)?.. ఏ విషయం తెలియక ప్రజలు కంగారు పడుతున్నారు! తాజాగా ఓషన్ కౌంటీకి చెందిన ఒక అధికారి.. అట్లాంటిక్ మహా సముద్రం వైపు నుంచి 50 యూఏవీలు వస్తున్న విషయాన్ని గుర్తించి పై అధికారులను అప్రమత్తం చేశాడు. వెంటనే ఆ కౌంటీ షెరీఫ్ మైకేల్.. ఆ 50 డ్రోన్లలో ఒకదాన్ని అనుసరించడానికి ‘ఇండస్ట్రియల్ గ్రేడ్’ డ్రోన్‌ను ప్రయోగించారు. కానీ, ఆ యూఏవీ.. తాము పంపిన డ్రోన్‌ను చాలా సులభంగా, వేగంగా తప్పించుకుని వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. ఈ యూఏవీలు ఏవీ సాధారణ డ్రోన్ల తరహాలో వేడిని విడుదల చేయట్లేదని ఆయన వివరించారు.
అట్లాంటిక్ సముద్రం నుంచి వస్తున్న ఈ డ్రోన్ల గురించి ఆయన న్యూజెర్సీ రాష్ట్ర పోలీసులకు, ఎఫ్‌బీఐ అధికారులకు, తీర రక్షక దళానికి సమాచారం అందించగా.. 8 అడుగుల విస్తీర్ణం ఉన్న 13 డ్రోన్లు తమ నౌకల్లో ఒకదాన్ని అనుసరిస్తున్నట్టు తీర రక్షక దళం తెలిపింది. అయితే, ఆ ప్రాంతంలో పలు సైనిక స్థావరాలున్న నేపథ్యంలో.. అవి సైన్యం పరీక్షిస్తున్న గగనతల వాహనాలా? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. ఒకవేళ ఈ యూఏవీలు అమెరికా సైన్యానికి చెందినవి కాకపోతే.. అది మరింత భయానకమైన విషయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి ఇరాన్‌కు చెందిన మదర్ షిప్ నుంచి వస్తున్న డ్రోన్లని కొందరు.. చైనా డ్రోన్లని మరికొందరు.. సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని పెంటగాన్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిపింది. అవి సైన్యానికి చెందిన డ్రోన్లా కాదా అనే విషయం ఇప్పటికీ తేలకపోవడంతో.. దీనిపై సమాధానాలు కోరుతూ న్యూజెర్సీ గవర్నర్ బైడెన్‌కు లేఖ రాశారు.