Trade War : పన్నుల యుద్ధంలో విజేతలు ఉండరు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:18 AM
వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 60ు మేర, కెనడా వస్తువులపై 25% మేర పన్నులను పెంచుతామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్య
బీజింగ్, టొరాంటో, డిసెంబరు 10: వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 60ు మేర, కెనడా వస్తువులపై 25% మేర పన్నులను పెంచుతామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో జిన్‌పింగ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరిచుకొంది. చైనా తమ మేధోపర సంపదను దొంగిలిస్తోందని, అక్రమ వాణిజ్య విధానాలకు పాల్పడుతోందని ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్న ట్రంప్ దానికి ప్రతిగా పన్నులు పెంచాలని భావిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఆర్థిక సంస్థల అఽధిపతుల సమావేశంలో ప్రసంగించిన జిన్‌పింగ్ స్పందించారు. ‘‘పన్నుల పోరులు, వాణిజ్య పోరాటాలు, సాంకేతిక పరిజ్ఞాన యుద్ధాలన్నవి చారిత్రక పరిణామాలు, ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా జరుగుతాయి. వీటిలో విజేతలు ఎవరూ ఉండరు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, సహకారాన్ని పెంచుకుంటామని తెలిపారు. మరోవైపు అక్రమ వలసలు, మాదకద్రవ్యాలను అరికట్టకపోతే కెనడా, మెక్సికోలపై పన్నులు పెంచుతామని కూడా ట్రంప్ హెచ్చరించారు. వాటికి ఆర్థిక సాయం చేసే బదులు అమెరికాలో రాష్ట్రాలుగా చేర్చుకుంటే మంచిదని అన్నారు. దీనిపై కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో స్పందించారు. సోమవారం హలిఫాక్స్ వాణిజ్య మండలి సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ పాలనలో వాణిజ్యం సవాళ్లతో కూడుకొని ఉంటుందని చెప్పారు. జీవనం సులభతరం చేస్తామన్న హామీతో ట్రంప్ అధికారంలోకి వచ్చారని, కానీ కెనడా వస్తువులపై పన్నులు పెంచితే దాని ప్రభావం అమెరికా దక్షిణ సరిహద్దులోని ప్రజలపై ఉంటుందని తెలిపారు. అక్కడి వారు కెనడా నుంచి వస్తువులను ఉపయోగిస్తారని, పన్నులు పెంచితే ఆ భారాన్ని వారు మోయాల్సి ఉంటుందని చెప్పారు.