Xi Jinping: ముయిజ్జు మా మిత్రుడు.. మాల్దీవుల వివాదం నడుమ చైనా కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 11 , 2024 | 08:20 AM
ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) చైనా పర్యటన నిప్పు రాజేస్తోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) ముయిజ్జుని తమ పాత మిత్రుడిగా అభివర్ణించారు.
బీజింగ్: ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) చైనా పర్యటన నిప్పు రాజేస్తోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) ముయిజ్జుని తమ పాత మిత్రుడిగా అభివర్ణించారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం.. తదితర అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి. భారత్, మాల్దీవుల మధ్య తాజాగా జరిగిన వివాదం విషయాన్ని కూడా జిన్ పింగ్.. ముయిజ్జుతో చర్చించినట్లు సమాచారం. ముయిజ్జు కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాలు 20 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలని చైనా ఎదురుచూస్తోందని జిన్ చెప్పారు. ముయిజ్జు జనవరి 12న మాలేకు తిరిగి రావడానికి ముందు చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్, ఇతర సీనియర్ అధికారులను కలవాలని భావిస్తున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్(Lakshadweep)లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరడంతో పాటు సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన మోదీ.. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరారు. దీనిపై మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్ అక్కసు వెళ్లగక్కారు.
పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తమ దేశం అందించే సర్వీసుల్ని అక్కడ అందించలేరని, అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని జహీద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మండిపడ్డ భారతీయులు.. పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారత్, మాల్దీవులకు మధ్య వివాదం ప్రారంభమైంది.