ట్రంప్ సభ వద్ద సాయుధుడి అరెస్టు
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:41 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభకు తుపాకీతో వచ్చిన సాయుధుడిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.
తుపాకీ, పేలుడు పదార్థాలు,
నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం
లాస్ ఏంజెల్స్, అక్టోబరు 14: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభకు తుపాకీతో వచ్చిన సాయుధుడిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. అతని వద్ద ఎక్కువ తూటాల సామర్థ్యం కలిగిన మేగజైన్‌ను కూడా గుర్తించారు. అతని వాహనం నుంచి పేలుడు పదార్థాలు, అనేక నకిలీ పాస్‌పోర్టులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలోని లాస్ ఏంజెల్స్ నగరానికి తూర్పున ఉన్న కోచెల్లా కౌంటీలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. నిందితుడిని లాస్ వెగా్‌సకు చెందిన 49 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు రిజిస్టర్ కాని నల్లని ఎస్‌యూవీలో వచ్చాడని, దానిపై నకిలీ లైసెన్సు ప్లేటు ఉండటంతో సిబ్బంది అడ్డుకున్నారని అధికారులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసే సమయానికి ఇంకా ట్రంప్ ఆ సభకు రాలేదన్నారు. ‘ఏదో ఒక కీడు జరగకుండా మేం అడ్డుకున్నాం. అయితే, ఆ కీడు ఏమిటనేది చెప్పలేం’ అన్నారు. ట్రంప్‌పై ఇటీవల రెండు హత్యాయత్నాలు జరగడంతో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు.