PM Modi: ఖతార్‌తో సహకారాన్ని పెంపొందించుకుంటాం.. విదేశీ పర్యటన ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 15 , 2024 | 07:55 PM
గల్ఫ్ దేశాలతో(Gulf Countries) సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. గురువారం ఖతార్ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఎక్స్‌లో(X) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖతార్: గల్ఫ్ దేశాలతో(Gulf Countries) సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కృషి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. గురువారం ఖతార్ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఎక్స్‌లో(X) కీలక వ్యాఖ్యలు చేశారు. తన తాజా పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త స్నేహాన్ని చిగురింపజేస్తుందని.. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సంస్కృతి వంటి కీలక రంగాల్లో ఖతార్‌తో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్ ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు.
ఒక రోజు పర్యటనలో భాగంగా మోదీ ఖతార్ అమీర్, షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ - థానీతో విస్తృత చర్చలు జరిపారు. వారు ప్రధానంగా వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడి రంగాలలో భారత్ -ఖతార్ సంబంధాలను బలపరుచుకోవడంపై చర్చలు జరిపారు.
అంతకుముందు దోహాలో ఫాదర్ అమీర్, హమద్ బిన్ ఖలీఫా అల్ థానీతో మోదీ సమావేశమయ్యారు. "దశాబ్దాలుగా ఖతార్ అభివృద్ధికి బాటలు వేసిన ఫాదర్ అమీర్ నాయకత్వానికి ప్రధాని అభినందనలు తెలిపారు. ఇరువురు నేతలు భారత్-ఖతార్ సంబంధాలపై చర్చలు జరిపారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌లో పర్యటించాల్సిందిగా అమీర్ హమద్ అల్ థానీని కూడా ప్రధాని ఆహ్వానించినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. అంతకుముందు మోదీ దోహాలో ప్రతిష్టాత్మక సదస్సులో ప్రసంగించారు. UAEలో తొలి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించారు.