Share News

Ustad Zakir Hussain: ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఇక లేరు

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:33 AM

ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీత.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) ఇక లేరు.

Ustad Zakir Hussain: ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఇక లేరు

ఊపిరితిత్తుల్లో సమస్యతో అమెరికాలో కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత తబలా మ్యాస్ట్రో కన్నుమూత

తండ్రి ఉస్తాద్‌ అల్లారఖా వద్ద శిక్షణ.. 12 ఏళ్లకే కచేరీలు

విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు

పద్మ పురస్కారాలతో గౌరవించిన భారత ప్రభుత్వం

ఐదు ‘గ్రామీ’లు సహా పలు అంతర్జాతీయ అవార్డులు

పుట్టగానే నన్ను మా నాన్న చేతుల్లో పెట్టారు. సంప్రదాయం ప్రకారం బిడ్డ చెవిలో తండ్రి ప్రార్థన చేయాలి. నవజాత శిశువును ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తూ కొన్ని మంచి మాటలు చెప్పాలి. కానీ మా నాన్న నన్ను చేతుల్లోకి తీసుకోగానే.. నా చెవిలో తబలా తాళాలు వినిపించారు. మా అమ్మ నిర్ఘాంతపోయి.. ‘‘ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయాలి మీరు’’ అని అంది. ‘‘నా ప్రార్థనలు ఇవే. నేను ప్రార్థన చేసేది ఇలాగే. నేను సరస్వతీ దేవి, వినాయకుడి భక్తుణ్ని’’ అని మా నాన్న అన్నారు. పరమభక్తుడైన ఒక ముస్లిం చెప్పిన మాట అది. తన గురువుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని కుమారుడికి పంచడానికే అలా చేశానని నాన్న చెప్పారు.

- జాకీర్‌ హుస్సేన్‌ తన తండ్రి గురించి చెప్పిన మాటలు

న్యూయార్క్‌, డిసెంబరు 16: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీత.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) ఇక లేరు. అధిక రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతూ రెండువారాలుగా శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా)లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు కన్నుమూశారు. జాకీర్‌హుస్సేన్‌ ‘ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌ (ఊపిరితిత్తుల వ్యాధి)’తో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. జాకీర్‌కు భార్య ఆంటోనియా మిన్నెకోలా, ఇద్దరు కుమార్తెలు అనీసా ఖురేషీ, ఇసబెల్లా ఖురేషీ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం లేదా గురువారం నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. లెజెండరీ తబలా మ్యాస్ట్రో.. ఉస్తాద్‌ అల్లారఖా ఖాన్‌ కుమారుడైన జాకీర్‌హుస్సేన్‌.. 1951, మార్చి 9న బొంబాయి (నేటి ముంబై)లో జన్మించారు. ఊహ తెలిసిన నాటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడిచారు! నిజానికి జాకీర్‌హుస్సేన్‌ తాతముత్తాతల్లో సంగీత కళాకారులెవరూ లేరు! ఆయన తండ్రి అల్లా రఖా.. పన్నెండేళ్ల వయసులో, సంగీతం నేర్చుకోవాలనే అభిలాషతో జమ్ముకశ్మీర్‌లోని తమ ఊరైన ఫగ్వాల్‌ నుంచి లాహోర్‌కు పారిపోయారు. అక్కడ మియా ఖాదర్‌ బక్స్‌ వద్ద పంజాబ్‌ ఘరానా పెర్కుషన్‌లో శిక్షణ పొందారు.

సంగీతమే లోకంగా జీవించిన ఆయన.. తన తొలి సంతానమైన జాకీర్‌ హుస్సేన్‌ పుట్టగానే ఆ చిన్నారి చెవిలో తారకమంత్రంలా తబలా తాళాలను వినిపించి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికారు. ఇంట్లో ఎల్లప్పుడూ మోగే తబలా నాదాలు వింటూ పెరిగిన జాకీర్‌.. చిన్న వయసులోనే తండ్రి నేతృత్వంలో సాధన ప్రారంభించారు. ‘‘అబ్బాజీ చాలా కఠినమైన గురువు. నేను వేరే గదిలో తబలా సాధన చేస్తున్నా.. ఒక చెవి ఆయన నాపైనే వేసి ఉంచేవారు. తనకు ఎప్పుడు ఏది నేర్పాలనిపిస్తే దాన్ని నేర్పేవారు. ఆయనతో జీవితం 24/7 ఒక సాధన ప్రక్రియలాగానే ఉండేది. ఫజల్‌, తౌఫీక్‌ (జాకీర్‌ తమ్ముళ్లు) పుట్టిన తర్వాత కూడా అది మారలేదు. మా వరకూ మాకు ఆయన మొదట గురువే. ఆ తర్వాతే తండ్రి’’ అని జాకీర్‌ ఒక సందర్భంలో వివరించారు. అలా తండ్రి కఠిన శిక్షణలో రాటుదేలిన జాకీర్‌హుస్సేన్‌.. ఏడేళ్ల వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. పన్నెండేళ్లకే దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి విశేష పేరుప్రఖ్యాతులు సంపాదించారు.


అదే సమయంలో అమ్మ మాట విని.. చదువులోనూ మేటి అనిపించుకున్నారు. ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి సంగీతంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఆ సమయంలోనే అక్కడ ఆయనకు పలువురు పాశ్చాత్య సంగీత కళాకారులతో పరిచయాలయ్యాయి. దీంతో తరచుగా అమెరికా పర్యటనలు చేస్తూ.. ఏడాదికి దాదాపు 150 దాకా కచేరీలు ఇస్తూ అక్కడా అమిత ప్రజాదరణ పొందారు. సితార్‌ మ్యాస్ట్రో పండిట్‌ రవిశంకర్‌తో కలిసి అమెరికాలో తొలిసారి కచేరీ ఇచ్చిన జాకీర్‌హుస్సేన్‌.. దరిమిలా పలువురు ప్రపంచ ప్రఖ్యాత కళాకారులతో కలిసి పనిచేశారు. ఇటు భారతదేశంలోనూ అలీ అక్బర్‌ ఖాన్‌, శివకుమార్‌ శర్మ వంటి ప్రముఖ సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్‌లో ఉండగానే ఆయనకు ప్రముఖ గిటారిస్ట్‌ జాన్‌ మెక్‌లా్‌ఫలిన్‌తో పరిచయమైంది. అంతర్జాతీయంగా పేరొందిన ‘బీటిల్స్‌’ బ్యాండ్‌లోని లీడ్‌ గిటారిస్ట్‌ జార్జ్‌ హ్యారిసన్‌కు జాకీర్‌హుస్సేన్‌ అత్యంత ఇష్టుడు.

gh.jpg

1971లో.. అమెరికన్‌ బ్యాండ్‌ ‘శాంతి’లో భాగమైన జాకీర్‌.. 1975లో జాన్‌ మెక్‌లా్‌ఫలిన్‌తో కలిసి ‘శక్తి’ బ్యాండ్‌లో పనిచేశారు. ఆ బ్యాండ్‌లో జాకీర్‌హుస్సేన్‌తోపాటు.. ఎల్‌ శంకర్‌, టీహెచ్‌ విక్కు వినాయక్‌ రామ్‌, ఆర్‌.రాఘవన్‌ కూడా ఉన్నారు. తర్వాత కొద్దికాలానికి విడిపోయిన ఆ బృందం.. మళ్లీ ‘రిమెంబర్‌ శక్తి’ పేరుతో మళ్లీ కలిసింది. 1987లో జాకీర్‌హుస్సేన్‌ తన తొలి సోలో ఆల్బమ్‌ ‘మేకింగ్‌ మ్యూజిక్‌’ను విడుదల చేశారు. దాదాపు ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో.. ఇటు భారతీయ సంప్రదాయ సంగీతానికి, అటు ప్రపంచ సంగీతానికి ఎనలేని సేవలందించారు. పలు భారతీయ, అంతర్జాతీయ చిత్రాలకు సంగీతం అందించడమే కాక.. హీట్‌ అండ్‌ డస్ట్‌ వంటి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డ జాకీర్‌ హుస్సేన్‌.. తన మేనేజర్‌, కథక్‌ నృత్య కళాకారిణి అయిన అంటోనియా మినెకోలా అనే ఇటాలియన్‌ అమెరికన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.. అనీసా, ఇసబెల్లా. పెద్ద కుమార్తె అనీసా చిత్రపరిశ్రమలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె నృత్య కళాకారిణి.


ఎన్నెన్నో అవార్డులు

వేలికొసలతో తబలపై అద్భుతాలు సృష్టించిన జాకీర్‌హుస్సేన్‌ ప్రతిభను.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి! తన కెరీర్‌లో ఆయన ఐదు గ్రామీ పురస్కారాలను అందుకున్నారు. అందులో మూడు.. ఈ ఏడాది అందుకున్నవే! ఒకేసారి మూడు గ్రామీలు అందుకున్న తొలి భారతీయుడు ఆయనే. ఇక భారత ప్రభుత్వం ఆయన్ను.. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. 2023లో.. దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించి గౌరవించింది.

చివరాఖరు: ‘‘మీ కచేరీ ప్రపంచంలో ఎక్కడ జరిగినా వేల మంది వస్తారు ఎందుకని?’’ అని ప్రశ్నిస్తే.. ‘‘అది నా గొప్పతనం కాదు. సంగీతం గొప్పతనం. నేను సంగీతానికి పూజారిని మాత్రమే’’ అని సవినయంగా సమాధానం ఇచ్చారు జాకీర్‌హుస్సేన్‌! ఆ వినయమే, నిత్య విద్యార్థిగా ఉండే తత్వమే, సంగీతంపై గౌరవమే.. ఆయన్ను నిజమైన ‘ఉస్తాద్‌’గా నిలిపాయి!!

ghylj.jpg

వాహ్‌ తాజ్‌!

నేపథ్యంలో తాజ్‌ మహల్‌! దాని ముందు జాకీర్‌హుస్సేన్‌, ఒక పిల్లాడు. ఇద్దరూ తబలా వాయిస్తుంటారు. చివర్లో జాకీర్‌ ఆ చిన్నారిని ఉద్దేశించి.. ‘వాహ్‌ ఉస్తాద్‌!’ అంటాడు. దానికి ఆ చిన్నారి.. ‘అరే హుజూర్‌, వహ్‌ తాజ్‌ బోలియే’ అంటాడు. ఇప్పుడు నాలుగు పదులు దాటినవారందరికీ ఆ యాడ్‌ ఓ మధుర జ్ఞాపకం! ఆ సంగతి పక్కన పెడితే... తాజ్‌మహల్‌ టీ పాశ్చాత్యదేశాల వినియోగదారులకు సంబంధించిందన్న అపప్రథను తొలగించిన యాడ్‌ అది. ఆ టీ భారతీయుల కోసం ఉద్దేశించినదే అనే విషయాన్ని తెలపడానికి ప్రకటనకర్తలు ప్రయోగించిన అస్త్రం.. జాకీర్‌హుస్సేన్‌. ఆ వాణిజ్యప్రకటన సృష్టికర్తలు.. కేవీ శ్రీధర్‌, కేఎస్‌ చక్రవర్తి. సుమంత్ర ఘోషల్‌ ఆ యాడ్‌ను చిత్రీకరించారు. ‘‘ఒక సంగీత కళాకారుడు సంగీతాభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి ఎలా వేలాది గంటలు సాధన చేస్తాడో.. అదే తరహాలో మావద్ద ఉన్న టీ టేస్టర్లు వేలాది రుచులను పరీక్షించి, చివరికి దీన్ని ఎంపిక చేశారని చెప్పడానికి మేం ఆ ప్రకటనను అలా రూపొందించాం’’ అని కేవీ శ్రీధర్‌ గతంలో తెలిపారు. అప్పట్లో వాణిజ్య ప్రకటనలనగానే.. ఎక్కువగా సినీ తారలు, క్రికెటర్ల వైపు చూసేవారు. అలాంటి సమయంలో తబలా మ్యాస్ట్రో అయిన జాకీర్‌హుస్సేన్‌ను ఈ ప్రకటనకు ఎంచుకోవడం ద్వారానే వారు సగం విజయం సాధించారని వాణిజ్యప్రకటనల నిపుణులు చెబుతారు!


gjhb.jpg

స్నేహితుడి పాడె మోసి..

జాకీర్‌హుస్సేన్‌ ప్రపంచం మొత్తానికీ ఉస్తాద్‌! దానికంటే ముందు.. సంతూర్‌ మ్యాస్ట్రో పండిట్‌ శివకుమార్‌ శర్మకు మాత్రం ప్రాణానికి ప్రాణమైన దోస్త్‌!! ఒకటా రెండా.. ఐదు దశాబ్దాలకు పైబడిన స్నేహం వారిది. సంగీత కళాకారులుగా మారిన వారి పరిచయం ప్రాణస్నేహంగా మారింది. 2022 మే నెలలో శివకుమార్‌ చనిపోయేదాకా వారి బంధం చెక్కుచెదరకుండా కొనసాగింది. శివకుమార్‌ చనిపోయినప్పుడు.. జాకీర్‌ హుస్సేన్‌ ఆయన పార్థివ దేహాన్ని తన భుజాలపై మోసి మిత్రుడిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు.. శ్మశానంలో శివకుమార్‌ శర్మ చితి పక్కన విచారంగా నిలబడి కంటతడి పెడుతున్న జాకీర్‌ హుస్సేన్‌ ఫొటో అప్పట్లో వైరల్‌ అయింది. ‘ఇదీ నిజమైన ఇండియా.. స్నేహానికి కుల, మత భేదాలు లేవు’ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో వారి స్నేహం గురించి విస్తృతంగా చర్చించుకున్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:33 AM