Ukraine Crisis : ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం
ABN , Publish Date - Dec 11 , 2024 | 06:10 AM
ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణకు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపుపై.. రష్యా స్పందించింది. ఉక్రెయిన్‌పై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. శాంతి నెలకొల్పడానికి దక్షిణాది దేశాలు, బ్రిక్స్ భాగస్వాములు చేసే
‘ఎక్స్’లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్
మాస్కో, డిసెంబరు 10: ఉక్రెయిన్‌లో తక్షణ కాల్పుల విరమణకు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపుపై.. రష్యా స్పందించింది. ఉక్రెయిన్‌పై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. శాంతి నెలకొల్పడానికి దక్షిణాది దేశాలు, బ్రిక్స్ భాగస్వాములు చేసే ప్రయత్నాలను స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు.. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి, రష్యా ప్రెసిడెన్షియల్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్‌ను ఉటంకిస్తూ రష్యా విదేశాంగ శాఖ సోమవారం ఒక ట్వీట్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌పై చర్చలకు రష్యా సిద్ధమని మా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. శాంతి నెలకొల్పే యత్నాలను స్వాగతించారు. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాలిం్సది ఏంటంటే.. చర్చలను తిరస్కరించింది ఉక్రెయినే. ఇప్పటికీ ఆ దేశం చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. రష్యన్ నాయకత్వంతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోకూడదని.. జెలెన్‌స్కీ స్వీయ నిషేధం విధించుకున్నారు. చర్చలను పునఃప్రారంభించాల్సిన బాధ్యత ఆయనదే’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది. అయితే.. దీనికన్నా ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఒక ట్వీట్ చేశారు. యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం వివరాలను తెలుపుతూ.. ‘‘ఇదీ యుద్ధం తాలూకూ వాస్తవం. ఇదేదో ఒక కాగితం ముక్క మీద కొన్ని సంతకాలతో అంత సులువుగా ముగిసిపోదు. ఎలాంటి హామీలూ లేని కాల్పుల విరమణ ఒప్పందాలు మనలేవు. మళ్లీ ఎప్పుడైనా ప్రారంభమవుతాయి. పుతిన్ గతంలో ఇదే చేశారు. ఆయన యుద్ధపిపాసి’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.