Share News

Joe Biden: పుతిన్‌పై జో బైడెన్ చేసిన ‘వెర్రి’ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్

ABN , Publish Date - Feb 22 , 2024 | 07:34 PM

అగ్రరాజ్యం అమెరికా (America), రష్యా (Russia) మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందన్న విషయం అందరికీ తెలుసు. తమదే ఆధిపత్యం సాగాలన్న ధోరణిని ఆ రెండు దేశాలు కనబరుస్తుంటాయి. అందుకే.. తరచూ పరస్పర విమర్శలు చేసుకుంటుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) నోరు పారేసుకున్నారు.

Joe Biden: పుతిన్‌పై జో బైడెన్ చేసిన ‘వెర్రి’ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్

అగ్రరాజ్యం అమెరికా (America), రష్యా (Russia) మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందన్న విషయం అందరికీ తెలుసు. తమదే ఆధిపత్యం సాగాలన్న ధోరణిని ఆ రెండు దేశాలు కనబరుస్తుంటాయి. అందుకే.. తరచూ పరస్పర విమర్శలు చేసుకుంటుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) నోరు పారేసుకున్నారు. పుతిన్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఆయన వల్ల అణుయుద్ధం రూపంలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని కుండబద్దలు కొట్టారు. బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో (San Francisco) విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘వ్లాదిమిర్ పుతిన్‌ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం.. అణుయుద్ధం గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ఎంతో ప్రమాదం’’ అని జో బైడెన్ చెప్పుకొచ్చారు. అలాగే.. రష్యాపై శుక్రవారం నుంచి కొత్త ఆంక్షలు విధిస్తామని కూడా ఆయన తెలిపారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతికి ప్రతిస్పందనగా ఈ ఆంక్షలు విధించబోతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌పై (Donald Trump) కూడా బైడెన్ విమర్శలు గుప్పించారు. నావల్నీ మృతికి, తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ ట్రంప్‌ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ విధంగా జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ (Kremlin) గురువారం కౌంటర్ ఇచ్చింది. పుతిన్‌పై బైడెన్ చేసిన వ్యాఖ్యలు.. అమెరికాకే ఎంతో అవమానకరమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్యలు పుతిన్‌లాంటి అధ్యక్షుడికి పెద్దగా నొప్పించవు కానీ, అవి ఆ అగ్రరాజ్యానికే అవమానం తెచ్చిపెడతాయని దుయ్యబట్టింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం హాలీవుడ్ కౌబాయ్ తరహాలో బైడెన్ ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) పేర్కొన్నారు. ఇలాంటి భాష వాడినందుకు ఆ దేశాధ్యక్షుడికి సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు.

Updated Date - Feb 22 , 2024 | 07:34 PM