Share News

Sheikh Hasina: కీలక ప్రకటన విడుదల చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు!

ABN , Publish Date - Aug 05 , 2024 | 09:51 PM

రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Sheikh Hasina: కీలక ప్రకటన విడుదల చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు!
Sheikh Hasina

రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌లోనే ఉంటే ప్రాణానికి ప్రమాదమని గుర్తించిన ఆమె హుటాహుటిన ఇవాళ(సోమవారం) భారత్‌కు వచ్చారు. ఇక్కడ ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె యూకేలో ఆశ్రయం కోరవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ కీలక ప్రకటన చేశారు.


షేక్‌ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చునని వాజెద్ జాయ్ అన్నారు. దేశాన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించారని, అయితే ప్రభుత్వంపై ప్రజల బలమైన సెంటిమెంట్‌ కారణంగా ఆమె నిరాశ చెందారని, అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ‘‘ఆమె బంగ్లాదేశ్‌ను రూపాంతరం చెందించారు. షేక్ హసీనా అధికారం చేపట్టినప్పుడు బంగ్లాదేశ్‌ను విఫలమైన దేశంగా పరిగణించేవారు. పేద దేశంగా చూసేవారు. అయితే నేడు ఆసియాలో ఎదుగుతున్న పులులలో ఒకటిగా బంగ్లాదేశ్‌ను పరిగణిస్తున్నారు’’ అని జాయ్ అన్నారు. బీబీసీ ‘వరల్డ్ సర్వీస్ న్యూస్ హవర్’ కార్యక్రమంలో సాజీబ్ వాజెద్ జాయ్ ఈ మేరకు మాట్లాడారు.


నిరసనకారులతో సజావుగా వ్యవహరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలను జాయ్ తోసిపుచ్చారు. ‘‘ వాళ్లు నిన్ననే 13 మంది పోలీసులను కొట్టి చంపారు. అలాంటి పరిస్థితుల్లో జనాలు గుంపులు గుంపులుగా వస్తే పోలీసులు ఏమి చేస్తారని మీరు భావిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. షేక్ హసీనా ఆదివారం నుంచే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు తన భద్రత కోసం దేశం విడిచి వెళ్లిపోయారంటూ వివరించారు. కాగా షేక్ హసీనాపై పలు విమర్శకులు వ్యక్తమవుతున్నాయి. ఆమె అవినీతి, బంధుప్రీతితో పాటు పౌర హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఆమె తీసుకొచ్చిన ఆర్థిక పురోగతి, అభివృద్ధిని మసక బార్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఎందుకీ రక్తపాతం?

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా అమలులో ఉండగా.. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకించింది. దీంతో ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకులు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు ఏకంగా 300 మందికి పైగా మరణించారు.

దేశంలో ఇంత కల్లోల పరిస్థితులు చెలరేగినా షేక్ హసీనా రాజీనామా చేయకపోవడంతో లక్షలాది మంది నిరసనకారులు సోమవారం ఆమె అధికార నివాసాన్ని చుట్టిముట్టారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడారు. భద్రత కోసం ఆర్మీ హెలీకాఫ్టర్‌లో భారత్‌కు చేరుకున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 09:54 PM