Share News

దక్షిణ కొరియా అధ్యక్షుడి అభిశంసన

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:00 AM

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు పార్లమెంటు(నేషనల్‌ అసెంబ్లీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడి అభిశంసన

తీర్మానానికి 204 మంది ఎంపీల మద్దతు.. విధుల నుంచి సస్పెండ్‌ అయిన యోల్‌

మార్షల్‌ లా’ విధింపుపై సభ్యుల ఆగ్రహం

రాజ్యాంగ ధర్మాసనానికి తీర్మానం ప్రతులు

తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని హన్‌ డక్‌

సియోల్‌, డిసెంబరు 14: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు పార్లమెంటు(నేషనల్‌ అసెంబ్లీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 3న ఆయన దేశంలో ‘మార్షల్‌ లా’(సైనిక పాలన) విధించడం.. దీనిపై ప్రతిపక్షాలు సహా ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. అసలు మార్షల్‌ లా విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న పార్లమెంటు సభ్యులు ఆయనను పదవి నుంచి అభిశంసించాలని పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చట్టసభలో యోల్‌కు వ్యతిరేకంగా ఇటీవల అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే.. అప్పట్లో అది వీగిపోయింది. అయినప్పటికీ.. సభ్యులు మరోసారి ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడంతో తాజాగా దీనిపై సభలో ఓటింగ్‌ నిర్వహించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా మొత్తం 300 మంది సభ్యుల్లో 204 మంది అనుకూలంగా ఓటేయగా కేవలం 85 మంది వ్యతిరేకించారు. దీంతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

ఫలితంగా యోన్‌ తన విధుల నుంచి సస్పెండ్‌ అయ్యారు. ఇక, ఇప్పుడు ఈ తీర్మాన ప్రతిని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తారు. దీనిపై కోర్టు 180 రోజుల్లో నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. అధ్యక్షుడి అభిశంసనకు కోర్టు కూడా పచ్చజెండా ఊపితే.. అప్పటి నుంచి 60 రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రధాని హన్‌ డక్‌ సూ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇదిలావుంటే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక భద్రత, విదేశీ సంబంధాల విషయంలో ప్రభుత్వం, చట్టసభ సభ్యులు కలివిడిగా ఉండాలని, దేశ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పీకర్‌ కిమ్‌-జిన్‌-ప్యో అభ్యర్థించారు. మరోవైపు, యోల్‌ అభిశంసనపై త్వరతిగతిన నిర్ణయం వెలువరించేందుకు వీలుగా రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తులను వెంటనే నియమించేలా చర్యలు తీసుకోవాలని ప్యో సూచించారు. తద్వారా కొన్ని వారాల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందన్నారు.


నాది రాక్షసులపై యుద్ధం: యోల్‌

తాను ప్రకటించిన మార్షల్‌ లా.. దేశంపై చేసిన తిరుగుబాటు చర్యకాదని అభిశంసన ఎదుర్కొంటున్న అధ్యక్షుడు యోల్‌ పేర్కొన్నారు. మార్షల్‌ లా ప్రకటన పాలనలో భాగమేనని తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులను హెచ్చరించేందుకే తాను మార్షల్‌ లా ప్రకటించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తనపై ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం కేవలం వ్యక్తిగతంగా తనను బాధించడమే కాదని, ఉన్నతస్థాయిలో ఉన్న అధ్యక్ష పదవిని అగౌరవ పరచడం, అధికారాలను లాగేసుకోవడమేనన్నారు. తద్వారా వచ్చే ఏడాది ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌ బిల్లును కూడా బలహీన పరిచాయరని యోల్‌ విమర్శించారు. దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్న క్రిమినల్‌ ముఠాలు అంతమయ్యే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - Dec 15 , 2024 | 05:00 AM