South Korea Politics : దక్షిణ కొరియాలో సైనిక పాలన.. ఉపసంహరణ
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:09 AM
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దేశంలో సైనిక పాలనను ప్రకటించి.. తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆరు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్షాల ఆధిపత్యం కొనసాగుతున్న పార్లమెంటులో తన అజెండా అమలుకు అడ్డంకులు ఎదురవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు మంగళవారం రాత్రి యూన్ ప్రకటించారు. రాత్రి 10.30 గంటలకు టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రతిపక్షాలు అభిశంసన పెట్టడంతో వెనక్కి తగ్గిన అధ్యక్షుడు
స్టాక్ మార్కెట్‌లో షేర్లు భారీగా పతనం
ఆచితూచి స్పందించిన ప్రపంచ దేశాలు
సియోల్, డిసెంబరు 4: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దేశంలో సైనిక పాలనను ప్రకటించి.. తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆరు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్షాల ఆధిపత్యం కొనసాగుతున్న పార్లమెంటులో తన అజెండా అమలుకు అడ్డంకులు ఎదురవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు మంగళవారం రాత్రి యూన్ ప్రకటించారు. రాత్రి 10.30 గంటలకు టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ వెంటనే సాయుధ సైనికులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. హెలికాప్టర్లు పార్లమెంటు భవనంపై చక్కర్లు కొట్టాయి. ఈ నిర్ణయం దేశ ప్రజలతోపాటు అంతర్జాతీయ సమాజాన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక మిత్రదేశం అమెరికాకు సైతం యూన్ ముందుగా ఈ విషయాన్ని తెలియజేయకపోవడం అమెరికా పాలకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్షాలతోపాటు, హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. వేలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. యూన్ రాజీనామా చేసే వరకు నిరవధిక సమ్మె చేస్తామని దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘాలు హెచ్చరించాయి. పార్లమెంటులో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రతిపక్ష సభ్యులు భద్రతా సిబ్బందితోనూ ఘర్షణపడ్డారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బుధవారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. యూన్ తక్షణమే గద్దె దిగాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది. అభిశంసన తీర్మానంపై శుక్రవారం ఓటింగ్ జరిపే అవకాశం ఉందని డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో సైనిక పాలనను ఉపసంహరిస్తూ బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా, 1980లో దక్షిణ కొరియా ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. ఆ దేశ నాలుగు దశాబ్దాల ప్రజాస్వామ్య చరిత్రలో సైనిక పాలన విధించడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది.