Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే.. అతని ఉద్దేశం ఏంటంటే?

ABN , Publish Date - Jul 14 , 2024 | 01:57 PM

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడు ఎవరో అధికారులు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే.. అతని ఉద్దేశం ఏంటంటే?
Donald Trump

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాల్పుల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడు ఎవరో అధికారులు గుర్తించారు. ఆ నిందితుడి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ అని, అతని వయసు 20 ఏళ్లు మాత్రమేనని తేలింది. అలాగే.. అతను బెతెల్ పార్క్ నివాసి అని వెల్లడైంది. ట్రంప్ నిర్వహించిన ర్యాలీ నుంచి ఈ పట్టణం 40 మైళ్ల దూరంలో ఉంది. అయితే.. అతడు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు? అతని ఉద్దేశం ఏంటి? అనే విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అతనికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రిపోర్ట్స్ ప్రకారం.. 130 గజాల దూరం నుంచి ఆ నిందితుడు ట్రంప్‌పై కాల్పులు జరిపినట్లు తెలిసింది. నిర్మాణంలో ఉన్న ఓ ప్లాంట్ పైకప్పుపై నుంచి మాథ్యూ ఈ దాడి చేశాడు. అతడు ఏఆర్ తరహా రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది వేదిక వద్దకు చేరుకొని, ట్రంప్‌ను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. తనకు బుల్లెట్ తాకినా.. ట్రంప్ ఏమాత్రం భయభ్రాంతులకు గురవ్వకుండా, ధైర్యంగా తిరిగి నిల్చోవడం గమనార్హం. మరోవైపు.. కాల్పులు జరిపిన వ్యక్తిని కొన్ని క్షణాల్లోనే గుర్తించి, సీక్రెట్ సర్వీస్‌కి చెందిన స్పైపర్ అతడ్ని కాల్చి చంపేశారు. ఇదే సమయంలో.. ట్రంప్ క్షేమంగానే ఉన్నారని, ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని సీక్రెట్ సర్వీస్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


కాగా.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఓసారి అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయన.. మరోసారి ఆ పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తున్న ఆయన, పెన్సిల్వేనియాలోనూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది మద్దతుదారులు హాజరయ్యారు. ఇంతలోనే కాల్పులు జరగడంతో.. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదిలావుండగా.. ట్రంప్‌పై జరిగిన దాడిని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్ తీవ్రంగా ఖండించారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 02:09 PM