Share News

సిరియా.. రెబెల్స్‌ వశం

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:09 AM

మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రజాగ్రహానికి గురవ్వగా.. తాజాగా సిరియా కూడా అదే బాటలో రెబెల్స్‌ హస్తగతమైంది.

సిరియా.. రెబెల్స్‌ వశం

రాజధాని డమాస్కస్‌ స్వాధీనం.. తిరుగుబాటుదార్ల విజయం

13 ఏళ్ల పోరాటం.. 54 ఏళ్ల అసద్‌ కుటుంబ పాలన అంతం

ముగిసిన అధ్యక్షుడు అసద్‌ శకం.. కుటుంబం సహా పరారీ

సంబరాలు జరుపుకొన్న దేశ ప్రజలు.. అధ్యక్ష భవనం లూటీ

సెంట్రల్‌ బ్యాంకులోనూ దోపిడీ.. మిలటరీ కోర్టుకు నిప్పు

నేడో రేపో సిరియాలో కొత్త ప్రభుత్వం!

డమాస్కస్‌, డిసెంబరు 8: మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రజాగ్రహానికి గురవ్వగా.. తాజాగా సిరియా కూడా అదే బాటలో రెబెల్స్‌ హస్తగతమైంది. అప్పటి అఫ్ఘానిస్థాన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అష్రఫ్‌ ఘనీ, శ్రీలంక అధినేత గొటబాయ రాజపక్స, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మాదిరిగా.. ఆదివారం సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ కూడా దేశాన్ని వీడారు. గత నెల 27 నుంచి క్రమంగా సిరియాలోని నగరాలు, గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హయాత్‌ తహ్రీర్‌ అల్‌ షమ్‌(హెచ్‌టీఎస్‌) నేతృత్వంలోని రెబెల్స్‌.. శనివారం కీలకమైన అలెప్పో, హమా, హోమ్స్‌, అల్‌-కమల్‌, డెయిర్‌ ఎజోర్‌ నగరాలతోపాటు.. ఉత్తర సిరియాను ఆక్రమించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి డమాస్క్‌సకు 10 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్న రెబెల్స్‌.. ఆదివారం ఉదయం రాజధాని నగరాన్ని పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ప్రజలు సంబురాలు జరుపుకోగా.. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశాన్ని వీడారు. ఆ వెంటనే రెబెల్స్‌ తమ విజయాన్ని ప్రకటించారు.

అసద్‌ ఎక్కడ

అసద్‌ ఆదివారం ఉదయమే తన కుటుంబంతో సహా రష్యా తయారీ ఐఎల్‌-76 విమానంలో సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు. మధ్యాహ్నానికి ఆ విమానం నుంచి రాడార్‌కు సంబంధాలు తెగిపోవడంతో.. ప్రమాదం జరిగి ఉంటుందని, అసద్‌ చనిపోయి ఉంటాడని సోషల్‌ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. సిరియా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఆయన విమానం 3,650 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా 1,070 మీటర్లకు పడిపోయినట్లు తేలిందని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. ఆ ప్రదేశం లెబనాన్‌ గగనతలం పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే.. సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో రాడార్‌కు అందకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసద్‌ ఎక్కడున్నాడనే విషయం శనివారం రాత్రి నుంచే తెలియదని సిరియా ప్రధాని మహమ్మద్‌ అల్‌-జలాలీ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకునే నాయకత్వంపై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


నేడో రేపో కొత్త సర్కారు!

రెబల్స్‌ ఒకట్రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు సిరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్యుద్ధంతో 70ు సిరియా దెబ్బతిన్నదని, పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుందని వివరించాయి. పశ్చిమదేశాలు, అమెరికా సాయం లేనిదే అది సాధ్యం కాదని, ఒకవేళ కొత్త సర్కారు ఇస్లామిక్‌ అతివాద ధోరణులను ప్రదర్శిస్తే.. ఆ దేశాలు సహకరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్‌ దేశాలు ఒకవేళ సాయం చేసినా.. పరిమితంగానే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుగుబాటు నాయకుడు అబూ మహమ్మద్‌ అల్‌-గోలానీని ప్రభుత్వాధినేతగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిపాయి. మరోవైపు.. తాము ఇంతకాలం ప్రభుత్వం చెప్పినట్లు వార్తలు రాశామని, అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు, వార్తాసంస్థలు రెబెల్స్‌కు సందేశాన్ని పంపాయి. తాము ప్రజల పక్షాన ఉంటూ.. నవ సిరియా నిర్మాణానికి సహకరిస్తామని, గత సర్కారు హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు వద్దని విజ్ఞప్తి చేశాయి.

జైళ్లలో అరాచకాలు

సొంత ప్రజలపైనే రసాయన, సిలిండర్‌ దాడులు చేయించిన అపఖ్యాతిని మూటగట్టుకున్న అసద్‌.. జైళ్లలో అమానుషంగా మరణ శిక్షలను విధించేవాడని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 2016లోనే ఆరోపించింది. అమ్నెస్టీ తమకు 2011-15 మధ్యకాలానికి సంబంధించిన అరాచకాల వివరాలే అందాయని, ఆ తర్వాత డేటా దొరకలేదని పేర్కొంది. ఈ మధ్యకాలంలోనే అధికారికంగా లక్ష మందికి మరణ శిక్షలు విధించినట్లు పేర్కొంది. అనధికారికంగా ఈ సంఖ్య 3 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఒక్క సాయ్‌డాన్‌యా జైలులోనే.. అధికారికంగా 30 వేల మంది ఖైదీలు మరణశిక్షకు గురయ్యారు. ఈ దారుణాలకు మారుపేరు సాయ్‌డాన్‌యా జైలు అని మాజీ ఖైదీలు చెబుతుంటారు. ముఖ్యంగా.. ఈ జైలులో రెండు భవనాలు ఉంటాయి. వాటిల్లో ఒకదానికి ఎరుపు రంగు, రెండోదానికి తెలుపు రంగు ఉంటుంది. సాయుధ తిరుగుబాటుదారులను ఎరుపు రంగు భవనంలో.. విచారణ కొనసాగుతున్న, తిరుగుబాటుదారుల సానుభూతిపరులను తెలుపురంగు భవనంలో పెట్టేవారు. రెండు వారాలకు ఓ సారి జడ్జితో విచారణ జరిపిస్తారు. 3-4 నిమిషాల్లోనే విచారణ పూర్తిచేస్తారు. ఎలాంటి వాదనలను వినకుండానే.. 30-50 మంది ఖైదీలకు మరణశిక్ష విధించేవారు. అదికూడా వెంటనే కాదు..! వారికి విషయం కూడా చెప్పేవారు కాదు..! వారిని వైట్‌ బిల్డింగ్‌కు తీసుకెళ్లి.. కళ్లకు గంతలు కట్టి, నానా చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత మరణశిక్షను అమలు చేసేవారని అమ్నెస్టీ వెల్లడించింది. ఇక జైలు అధికారులు బ్యారక్‌లకు వచ్చినప్పుడు.. తమ కళ్లకు గంతలు కట్టేవారని మాజీ ఖైదీలు చెబుతున్నారు. అర్ధరాత్రి పూట మరణశిక్షలు అమలు చేసేవారని, తుపాకీతో కాల్చినశబ్దాలు వినిపించేవారని, జైలులో ఉన్నన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపామని వివరించారు.


భారతీయులంతా క్షేమం

సిరియాలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డమాస్క్‌సలోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తోందని పేర్కొన్నాయి. సిరియాలో ఉన్న భారతీయులతో ఎంబసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపాయి. అధికారిక లెక్కల ప్రకారం సిరియాలో 90 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 14 మంది ఐరాస సంస్థల్లో పనిచేస్తున్నారు.

14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో మొదలైన పతనం

అసద్‌ అణచివేత విధానాలతో విసిగిపోయిన ఓ 14 ఏళ్ల బాలిక దక్షిణ సిరియాలోని దారా అనే ఊళ్లో గోడపై ‘డాక్టర్‌ ఇక నీ వంతు’ అనే అర్థం వచ్చేలా గ్రాఫిటీ చిత్రాలు వేసింది. ఇందుకుగాను ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్లని అరెస్టు చేసిన పోలీసులు 26 రోజులపాటు చిత్రహింసలకు గురి చేశారు. దీంతో దారాలో మొదలైన ప్రజాతిరుగుబాటు 2011 మార్చి 15 నాటికి దేశ వ్యాప్తంగా అంతర్యుద్ధానికి దారి తీసి అసద్‌ పతనానికి కారణమైంది.

సిరియాలో కొత్త శకం: రెబెల్స్‌

అసద్‌ పలాయనంతో.. తిరుగుబాటుదారులు సిరియా తమ వశమైందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘నిరంకుశ పాలకుడు అసద్‌ దేశాన్ని వీడాడు. సిరియాకు విముక్తి లభించింది. సిరియా ఇప్పుడే స్వేచ్ఛావాయువులను పీల్చనుంది. సిరియాలో కొత్త శకం ప్రారంభమైంది. విదేశాల్లో తలదాచుకుంటున్న సిరియన్లు ‘స్వేచ్ఛాయుత సిరియా’కు తిరిగి రావాలని కోరుతున్నాం’’ అని సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చారు. నిజానికి హెచ్‌టీఎ్‌స నేతృత్వంలోని తిరుగుబాటు దళాల ప్రతినిధి హసన్‌ అబ్దుల్‌ ఘనీ డమాస్క్‌సను చుట్టుముట్టడం ద్వారా ఆపరేషన్‌ను చివరి దశకు తీసుకొచ్చామని శనివారమే ప్రకటించారు. ఆదివారం ఉదయమే ఆయన తాము డమాస్క్‌సను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


రాజధానిలో లూటీ

అసద్‌ దేశాన్ని వీడి పారిపోయాడన్న వార్తతో.. ఆదివారం మధ్యాహ్నం ప్రజలు డమాస్కస్‌ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. దేవుడి కరుణతో నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. అదే సమయంలో.. రాజధాని నగరంలో లూటీలు కూడా జరిగాయి. అధ్యక్ష భవనంలోకి చొరబడ్డ ప్రజలు..దొరికిన వస్తువును దొరికినట్లు దోచుకున్నారు. రక్షణ శాఖ ఆఫీసులో కూడా లూటీ జరిగినట్లు వార్తలొచ్చాయి. సిరియా సెంట్రల్‌ బ్యాంక్‌లో కరెన్సీ కట్టలున్న డబ్బాలను కూడా పౌరులు ఎత్తుకెళ్లడం కనిపించింది. తర్వాత తిరుగుబాటు దారులు డబ్బులకు కాపలాగా ఉన్నారు.

గోలన్‌హైట్స్‌లో ఇజ్రాయెల్‌ పాగా

సిరియా అధ్యక్షుడు అసద్‌ పరారీతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌-సిరియా సరిహద్దుల్లో తన సైన్యాన్ని మోహరించింది. 1974 కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా.. గోలన్‌హైట్స్‌లో 2/3వ వంతు ఇజ్రాయెల్‌, మిగతా భూభాగం(బఫర్‌జోన్‌) సిరియా ఆధీనంలో కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్వయంగా సరిహద్దులకు వెళ్లి.. సైనికులకు దిశానిర్దేశం చేశారు. గోలన్‌హైట్స్‌ పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. అక్కడి ప్రజల(క్రిస్టియన్లు అధికం)ను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 04:09 AM