Taliban: కిటికీల ఏర్పాటుపై తాలిబాన్ల నిషేధం! ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Dec 30 , 2024 | 10:42 AM
మహిళలు ఎక్కువగా సంచరించే చోట్లకు అభిముఖంగా ఉండే ఇళ్లల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అసభ్యతకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అప్ఘానిస్థాన్‌లో తాలిబాన్లు మరో సంచలనానికి తెరతీశారు. మహిళలు సంచరించే ప్రదేశాలకు ఎదురుగా ఉండే నివాసాల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. పొరుగింటి వారి వంటగదులు మొదలు, బావులు వంటి వాటికి అభిముఖంగా ఎటువంటి కిటికీలు నిర్మించకూడదు. కొత్తగా నిర్మించబోయే భవంతుల్లో ఈ నిబంధన పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న ఇళ్లకు ఈ నిబంధన ప్రకారం మార్పులు చేయాలని, అవసరమైతే గోడలు కూడా నిర్మించుకోవాలని చెప్పుకొచ్చారు (Taliban).
‘‘వంటగదిలో పనిచేసేటప్పుడు, బావుల నుంచి నీరు తీసుకెళ్లేటప్పుడు మహిళలను చూస్తే అసభ్యతకు దారితీయొచ్చు’’ అని తాలిబాన్లు ఓ ప్రకటనలో తమ నిషేధానికి గల కారణాన్ని వివరించారు. ఇప్పటికే కిటికీలు ఉన్న ఇళ్ల యజమానులు పొరుగింటి వారికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Hamza bin laden: బతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు.. మళ్లీ ఊపిరి పోసుకుంటున్న అల్ ఖైదా!
2021లో తాలిబాన్లు ఆఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా అండతో పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కూలదోసి దేశ పగ్గాలు చేపట్టారు. నాటి నుంచి మహిళలపై కఠిన ఆంక్షలకు తెరతీశారు. బహిరంగ ప్రదేశాల్లో వారి సంచారంపై అనేక పరిమితులు విధించారు. ప్రాథమిక విద్యకు మించి మహిళలు చదవాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. వారు ఉద్యోగం చేయడంపై కూడా అనేక పరిమితులు తీసుకొచ్చారు. తాజాగా తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం, అప్ఘాన్ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడటం లేదా కవితలు వినిపించడం నిషేధం. కాగా, ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది.
Sarah Adams : తాలిబాన్లకు భారత్ నిధులు
మరోవైపు, తాలిబాన్లు, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అప్థానిస్థాన్‌లోని నిషేధిత ఉగ్రసంస్థ టీటీపీకి చెందిన స్థావరాలపై ఇటీవల పాక్ దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. శనివారం, ఆఫ్ఘాని సైనికులు పాక్ స్థావరాలపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ పారామిలిటరీ సైనికుడితో పాటు మొత్తం 11 మంది కన్నుమూశారు.
Read Latest and International News