Kamala Harris : ఫలించని పోరాటం!
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:11 AM
ట్రంప్‌పై మూడు నెలల క్రితం బరిలోకి దిగే వరకూ కమల పట్ల ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ట్రంప్‌నకు కమల చెమటలు పట్టించారనటం అతిశయోక్తి కాదు. ప్రెసిడెంట్ బైడెన్ మీద అలవోకగా విజయం సాధించే అంచనాల్లో
చివరి వరకూ తప్పుకోని బైడెన్..
లభించింది 3 నెలల సమయమే
జాతి వివక్ష, పురుషాధిక్యత ప్రభావం
హక్కుల ప్రచారం.. తటస్థ ఓటర్లు దూరం
కమలా హ్యారిస్ ఓటమికి పలు కారణాలు
ట్రంప్‌పై విజయానికి శాయశక్తులా కృషి చేసినా కమలకు తప్పని ఓటమి
వాషింగ్టన్, నవంబరు 6: ట్రంప్‌పై మూడు నెలల క్రితం బరిలోకి దిగే వరకూ కమల పట్ల ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ట్రంప్‌నకు కమల చెమటలు పట్టించారనటం అతిశయోక్తి కాదు. ప్రెసిడెంట్ బైడెన్ మీద అలవోకగా విజయం సాధించే అంచనాల్లో ఉన్న ట్రంప్.. ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు. కమలతో జరిగిన డిబేట్‌లో ట్రంప్ పూర్తిగా తేలిపోయారు. దాంతో, ఇకమీదట ఆమెతో మరో డిబేట్‌లో పాల్గొననని చేతులెత్తేశారు.అయితే, ప్రారంభంలో ఉన్న కమల దూకుడు క్రమంగా తగ్గుముఖం పట్టింది. సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యత చూపిన కమల మెల్లగా వెనుకబడిపోయారు. ధీరోదాత్తమైన పోరాటం జరిపిన కమల ఓటమి పాలయ్యారు. ఇంతకూ కమలా హ్యారిస్ ఓటమికి కారణాలేమిటి???
వ్యవధి: అన్నింటికన్నా పెద్ద కారణం.. ఆమెకు లభించిన స్వల్ప వ్యవధి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు సంవత్సరాల ముందుగానే ప్రణాళికలు రచించుకొని, సాధనసంపత్తిని సమకూర్చుకుంటారు. కానీ, కమలకు ఆ అవకాశం లభించలేదు. అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్.. ఈసారి కూడా తానే బరిలో ఉంటానని చివరివరకూ భీష్మించుకొని కూర్చున్నారు. వయసు మీద పడిన బైడెన్ ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆయన కుర్చీని వదులుకోవటానికి సిద్ధపడలేదు. చివరికి జూలై 21న తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కమల ముందుకొచ్చారు. అంటే, ట్రంప్‌తో తలపడటానికి కమలకు కేవలం 3 నెలల సమయం మాత్రమే లభించింది.
జాతి వివక్ష: అగ్రరాజ్యం అమెరికాలో శ్వేతజాతి ఆధిపత్య ఛాయలు పోలేదు. నల్లవారిపై అప్పుడప్పుడూ జరిగే దారుణమైన దాడులే దీనికి నిదర్శనం. ట్రంప్‌ను ఈ శ్వేతజాతి ఆధిపత్యవాదానికి ప్రతీకగా జరిపిన ప్రచారం శ్వేతజాతీయుల్లో ఆయన పట్ల గణనీయమైన మద్దతు పెంచింది. ఇదే అంశం ఆఫ్రికా, ఆసియా వారసత్వం కలిగి ఉన్న కమలకు ప్రతికూలంగా పరిణమించింది. దీంతోపాటు, అమెరికా రాజకీయాల్లో పురుషాధికత్యనే అక్కడ రాజ్యమేలుతోంది. దీనివల్లే ఆ దేశంలో ఇప్పటికీ ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోయారు. వైస్ ప్రెసిడెంట్ పదవిని ఒక మహిళ తొలిసారిగా చేపట్టటం.. కమలా హ్యారి్‌సతోనే ప్రారంభమైంది.
కీలక రాష్ట్రాల్లో కిందికి
‘స్వింగ్ స్టేట్స్’గా పేరొందిన 7 రాష్ట్రాలు చివరి క్షణం వరకూ ఎటువైపు ఉంటాయో తెలియని పరిస్థితి ఈసారి నెలకొంది. ఈ రాష్ట్రాలను ఎవరు కైవసం చేసుకుంటే వారే అధ్యక్ష పదవిని చేపడతారని విశ్లేషణలు వచ్చాయి. దీనికి తగినట్లుగానే, ఈ స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్‌గెలిచి అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఈ రాష్ట్రాల్లో కమల ఎందుకు ఓడిపోయారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలైన ఓట్ల తాలూ కు పూర్తి సమాచారం వెల్లడైన తర్వాతే కారణాలేమిటో తెలుస్తాయి.
పార్టీపై అసంతృప్తి
డెమోక్రటిక్ పార్టీలో గత నాలుగేళ్లుగా పటిష్ఠమైన నాయకత్వం లేకపోవటంతో.. ఆ పార్టీ అభిమానుల్లో, ఓటర్లలో కొంత నిస్తేజం నెలకొంది. మరోవైపు, ట్రంప్ దూకుడు వైఖరి రిపబ్లికన్ ఓటర్లలో ఉత్సాహం నింపింది.