Share News

వెయ్యి రోజుల యుద్ధం.. కోటి తగ్గిన ఉక్రెయిన్‌ జనాభా

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:58 AM

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే.

వెయ్యి రోజుల యుద్ధం.. కోటి తగ్గిన ఉక్రెయిన్‌ జనాభా

కీవ్‌, నవంబరు 19: ఉక్రెయిన్‌ రష్యా యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో ఇరువైపులా పది లక్షల మంది చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది. 21వ శతాబ్దంలో ఇప్పటివరకు చవిచూసిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే. ఉక్రెయిన్‌లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మిగిలాయి. ఉక్రెయిన్‌ సైన్యంలో 80 వేల మంది చనిపోయారు. నాలుగు లక్షల మంది గాయపడి కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. రష్యా వైపు సైన్యంలో మరణాలు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. క్షతగాత్రులు నాలుగు లక్షల వరకు ఉంటారు. నిజానికి రెండు దేశాల్లోనూ యుద్ధం లేని సమయంలోనే జనాభా తరుగుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. యుద్ధంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఉక్రెయిన్‌లో ప్రజలు 12 వేల మంది చనిపోయారు. 25 వేల మంది గాయపడ్డారు. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో పిల్లల్ని కనేవారు మరింత తగ్గిపోయారు. రెండున్నరేళ్ల క్రితం ఉన్న జననాల రేటు మూడోవంతు పడిపోయింది. యుద్ధాల వల్ల కాకుండా సహజ మరణాలు, వలసలు, జననాల రేటు తగ్గిపోవడం కారణంగా ఉక్రెయిన్‌లో గత రెండున్నర ఏళ్లలో కోటి మంది జనాభా తగ్గిపోయారు. నాలుగు కోట్ల మంది ఉన్న జనాభా మూడు కోట్లు అయ్యారు. ఏకంగా 67 లక్షల మంది వలస వెళ్లారు. ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ మూడోవంతు కుంచించుకుపోయింది. ఆస్తి నష్టం 13 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Updated Date - Nov 20 , 2024 | 04:58 AM