ప్రమాణం చేయగానే.. వాటి పని పడతా!
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:34 AM
కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైనా 25ు సుంకం విధిస్తామని, చైనా ఉత్పత్తులపై 10% విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధిస్తా.. చైనా మీద 10%
ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు, డ్రగ్స్, నేరస్థులు
తీరు మార్చుకునే దాకా సుంకం పోటు తప్పదు: డొనాల్డ్ ట్రంప్
భారత్‌కు వాణిజ్యపరంగా లబ్ధి!.. చైనాకు దీటుగా ఎదిగే చాన్స్
వాషింగ్టన్, నవంబరు 26: కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైనా 25ు సుంకం విధిస్తామని, చైనా ఉత్పత్తులపై 10ు విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మంగళవారం ప్రకటించారు. జనవరి 20న తాను అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే తీసుకునే మొట్టమొదటి చర్యల్లో ఇదొకటని, ఈ మేరకు ఆ రోజున కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు. ‘ఒపెన్ బోర్డర్’ విధానం కారణంగా కెనడా, మెక్సికోల నుంచి వేలాదిమంది జనం అమెరికాలోకి వస్తున్నారని, వారు తమ వెంట డ్రగ్స్‌ను తీసుకొస్తున్నారని, వారిలో అనేక మంది నేరస్థులు ఉంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘వారిని నియంత్రించి అమెరికాలోకి రాకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అప్పటి వరకూ ఆ దేశాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగానే, వాటి ఉత్పత్తులపై 25ు సుంకం విధిస్తాం’ అని చెప్పారు. ఇక చైనా నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని, వాటిలో ఫెంటనిల్ ముఖ్యమైనదని.. మెక్సికో ద్వారా ఈ డ్రగ్స్ అమెరికాలోకి వస్తున్నాయని చెప్పారు. తన తొలి పర్యాయంలో..
ఈ సమస్యను పరిష్కరించాలని చైనా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. చైనా ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ అవి ఆచరణ రూపం దాల్చలేదన్నారు. అందువల్లే, ఆ దేశ ఉత్పత్తులపై 10ుఅదనపు సుంకం విధిస్తామన్నారు. 2022లో అమెరికా 53,600 కోట్ల డాలర్ల విలువైన (రూ.45,17,530 కోట్లు) ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఇవి ఆ ఏడాది అమెరికా దిగుమతుల్లో 16 శాతం. ఇప్పుడు, చైనా మీద ట్రంప్ 10 శాతం అదనపు సుంకం విధించటం వల్ల.. అది భారత్‌కు లబ్ధి కలిగించే పరిణామం అవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే మేధోసంస్థ డైరెక్టర్ నీలాంజన్ ఘోష్ మాట్లాడుతూ, అధిక సుంకాల వల్ల నష్టపోయే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను, ఆఫీసులను భారత్, వియత్నాం, ఇండొనేషియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. జనాభాలో అధికశాతం యువత ఉన్న భారత్‌కు మిగిలిన దేశాలకన్నా ఎక్కువ అనుకూలత ఉందని, దీనిని భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.