Rahul Gandhi: రాహుల్ గాంధీ, కమలా హారిస్ నిజంగానే ఫోన్‌లో మాట్లాడారా..?
ABN , Publish Date - Jul 13 , 2024 | 07:21 PM
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. గురువారం సాయంత్రం వీరిద్దరి మధ్య సంభాషణ...
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో (Kamala Harris) ఫోన్‌లో మాట్లాడినట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. గురువారం సాయంత్రం వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు కొన్ని కథనాలొచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. స్వయంగా అమెరికా ఉపాధ్యాక్ష కార్యాలయం దీనిపై స్పందిస్తూ.. రాహుల్, కమలా హారిస్ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అమెరికా జర్నలిస్టు ఒకరు వెల్లడించారు. ‘‘ఈ వార్తల్లో నిజం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ధ్రువీకరించింది. రాహుల్ గాంధీతో కమలా హారిస్ మాట్లాడలేదు’’ అని ఆ జర్నలిస్టు తన సోషల్ మీడియాలో పోస్టులో తెలిపారు.
ఈ వార్తని ఎవరు పుట్టించారో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అయ్యింది. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఈ ప్రచారం ఊపందుకోవడంతో, దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బహుశా ఎన్నికల గురించే రాహుల్, కమలా మధ్య సంభాషణ సాగి ఉండొచ్చని కూడా రూమర్లు వినిపించాయి. అయితే.. ఇప్పుడు ఈ వార్తలో వాస్తవం లేదని తేలిపోయింది. మరోవైపు.. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం. అసలు ఈ వార్త వారి దృష్టికి వెళ్లిందో లేక వచ్చినా పట్టించుకోలేదో తెలీదు. ఏదేమైనా.. ఈ వార్త మాత్రం కొద్దిసేపే నెట్టింట్లో పెద్ద అలజడినే సృష్టించింది.
ఇదిలావుండగా.. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. వయసు, అనారోగ్య సమస్యల రీత్యా ఆయనపై వ్యతిరేకత నెలకొంది. ఆయన రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ ఆయన తప్పుకుంటే మాత్రం.. అధ్యక్ష ఎన్నికల్లో కమలాహారిస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Latest International News and Telugu News