Share News

Washington : కమలకు ఒబామా దంపతుల మద్దతు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:39 AM

కమలా హ్యారిస్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా సమర్థించారు. దీనిపై వారు శుక్రవారం కమలకు ఫోన్‌ కాల్‌ చేసి మాట్లాడారు.

Washington : కమలకు ఒబామా దంపతుల మద్దతు

  • ఒక్క జూమ్‌ కాల్‌తో హారి్‌సకు రూ.16.74 కోట్ల విరాళాలు

  • జూమ్‌ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్‌ కాల్‌గా రికార్డు

వాషింగ్టన్‌, జూలై 26: కమలా హ్యారిస్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామా సమర్థించారు. దీనిపై వారు శుక్రవారం కమలకు ఫోన్‌ కాల్‌ చేసి మాట్లాడారు. ‘మీకు మద్దతు ఇవ్వడానికి మేం ఎంతగానో గర్విస్తున్నాం. ఈ ఎన్నికల్లో మీరు గెలవడానికి చేయాల్సిందంతా చేస్తాం’ అని కమలకు బరాక్‌ హామీ ఇచ్చారు. ‘మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం.

ఇది చరిత్రాత్మకం కాబోతోంది’ అంటూ మిషెల్‌ కూడా తన మద్దతు ప్రకటించారు. అందుకు హ్యారిస్‌ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కాల్‌కు సంబంధించి దాదాపు ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను మిషెల్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. కమలను డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమె తరఫున ప్రచార కార్యక్రమాల్లో కూడా బరాక్‌ ఒబామా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు, కమలా హ్యారి్‌సకు డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులతో పాటు దాతలు, రాజకీయ నాయకుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

ఇప్పుడు పార్టీలో కీలక నేత ఒబామా మద్దతు సైతం లభించడం నిధుల సమీకరణకు దోహదపడనుంది. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సాధించే దిశగా కమలా హారిస్‌ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి కమల కోసం నిర్వహించిన ఓ జూమ్‌ కాల్‌లో ఏకంగా 1,64,000 మంది మహిళలు పాల్గొని, విరాళాలతో హోరెత్తించారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ జూమ్‌ కాల్‌లో ఏకంగా రూ.16.74 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ‘వైట్‌ ఉమన్‌: ఆన్సర్‌ ద కాల్‌’ పేరిట కమలకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమం జూమ్‌ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్‌ కాల్‌గా రికార్డు సృష్టించింది.

జూమ్‌ మీటింగ్‌ ప్రారంభం కాగానే విపరీతమైన స్పందన వచ్చింది. సభ్యుల సంఖ్య పెరుగుతూ పోవడంతో కొద్దిసేపు సర్వర్‌ క్రాష్‌ అయింది. కాగా, కమలకు పిల్లలు లేరంటూ జేడీ వాన్స్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె సవతి కుమార్తె ఎల్లా ఎంహాఫ్‌ తాజాగా స్పందించారు. మేమంతా ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారని నిలదీశారు.

Updated Date - Jul 27 , 2024 | 03:41 AM