Donald Trump: ట్రంప్ వెనుక ఆ మహిళ ఎవరు.. ఫోన్‌లో ఆమె ఏం చేస్తోంది?
ABN , Publish Date - Jul 16 , 2024 | 05:39 PM
మన చుట్టుపక్కల ఏదైనా ఒక పేలుడు సంభవిస్తే ఏం చేస్తాం..? వెంటనే ప్రాణభయంతో పరుగులు పెట్టడమో, సురక్షిత ప్రదేశంలో దాక్కోవడమో చేస్తాం. మనం సురక్షితంగా బయటపడినా.. ఆ భయం నుంచి కోలుకోవడానికి..
మన చుట్టుపక్కల ఏదైనా ఒక పేలుడు సంభవిస్తే ఏం చేస్తాం..? వెంటనే ప్రాణభయంతో పరుగులు పెట్టడమో, సురక్షిత ప్రదేశంలో దాక్కోవడమో చేస్తాం. మనం సురక్షితంగా బయటపడినా.. ఆ భయం నుంచి కోలుకోవడానికి చాలానే సమయం పడుతుంది. అసలేం జరిగిందనే ఆందోళన చెందుతుంటాం. అయితే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కాల్పులు జరిపినప్పుడు.. ఒక మహిళ చాలా ప్రశాంతంగా కనిపించడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు అందరూ భయంతో పరుగులు పెడుతుంటే.. ఆ మహిళ మాత్రం తాపీగా మొబైల్ ఫోన్ పట్టుకొని, ఆ ఘటనని రికార్డ్ చేస్తున్నట్టు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో.. ట్రంప్ వెనకాలే తెల్లటి దుస్తులు, సన్ గ్లాసెస్, నల్లటి టోపీ ధరించిన ఓ మహిళను (Suspicious Woman) మనం గమనించవచ్చు. ట్రంప్‌పై దాడి జరగడానికి ముందు.. ఆమె దిక్కులు చూసింది. ఆ తర్వాత తన సీట్‌లో కూర్చున్నప్పుడు కూడా అటుఇటు పలుమార్లు తల తిప్పుతూ కనిపించింది. ఇంతలోనే ట్రంప్‌పై దాడి జరగ్గా.. అందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నేలపై ఒరిగేందుకు ప్రయత్నించారు. స్టేజ్ వెనకాల దాక్కోవడానికి ట్రై చేశారు. కానీ.. ఆ మహిళలో మాత్రం ఎలాంటి భయం కనిపించలేదు. అప్పటికప్పుడే తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసింది. బహుశా ఆ ఘటనని రికార్డ్ చేయడం కోసం ఆ ఫోన్ తీసిందో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. దీంతో.. ఆ మహిళ ఎవరు? అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో.. ఆ కాల్పుల ఘటనపై అనేక కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోస్తోంది. ట్రంప్‌పై దాడి జరగబోతోందని ఆమెకు ముందే తెలుసా? అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా తాపీగా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు సైతం రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు.. ఈ దాడి వెనుక నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఉద్దేశం ఏంటో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. అతని ఫోన్, ల్యాప్‌టాప్‌లను పరిశీలిస్తున్నారు. ఈ దాడికి ముందు రోజు అతడు షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడని, ఒక దుకాణం నుంచి బుల్లెట్లు కొన్నాడని ఇదివరకే విచారణలో తేలింది.
Read Latest International News and Telugu News