Ebrahim Raisi: విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రపంచ ప్రముఖులు వీళ్లే..
ABN , Publish Date - May 20 , 2024 | 05:09 PM
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. కానీ విమాన ప్రమాదాల్లో వివిధ దేశాధినేతలు, ప్రముఖ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులు తరచూ విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణించాల్సి రావడం వలన ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. కానీ విమాన ప్రమాదాల్లో వివిధ దేశాధినేతలు, ప్రముఖ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులు తరచూ విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణించాల్సి రావడం వలన ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మృతిచెందిన ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
రామన్ మెగసెసే, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరొందిన రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. తన పాలన ద్వారా దేశ ప్రజల విశ్వాసం పొందిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే 1957 మార్చి 17న జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు. విమానంలో మనీలాకు తిరిగి వస్తుండగా ఫిలిప్పీన్స్‌లోని సెబులోని మనుంగ్‌గల్ పర్వతంపై ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది.
రషీద్ కరామి, లెబనాన్ ప్రధాని
ఎనిమిది సార్లు లెబనాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి రషీద్ కరామి. లెబనాన్‌లోని అత్యంత ముఖ్యమైన రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1987 జూన్1న రషీద్ కరామి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో బాంబు పేలి ఆయన మృతి చెందారు.
Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఏది.. దాని చరిత్ర ఏంటి?
ముహమ్మద్ జియా-ఉల్-హక్, పాకిస్తాన్ అధ్యక్షుడు
పాకిస్తాన్ ఆరవ అధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ 1988 ఆగస్టు 17న మరణించారు. బహవల్పూర్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న C-130 హెర్క్యులస్ విమానం కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌పై సోవియట్ దండయాత్రలో ఆఫ్ఘన్ ముజాహిదీన్‌కు జియా-ఉల్-హక్ మద్దతు ఇచ్చినందున, ఈ ప్రమాదం వెనుక సోవియట్ యూనియన్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
జువెనల్ హబ్యారిమనా, రువాండా అధ్యక్షుడు
జువెనల్ హబ్యారిమనా 1973లో రువాండా అధ్యక్షుడయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా పనిచేశారు. హుటు జాతికి చెందిన హబ్యారిమనా రువాండా మొదటి అధ్యక్షుడు గ్రెగోయిర్ కైబండా ఆధ్వర్యంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. జువెనల్ ఒక నియంత. అతని పాలనలో రువాండా నిరంకుశ రాజ్యంగా మారిందనే పేరుంది. 1994 ఏప్రిల్ 6న కగాలి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అతని విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో జువెనల్ హబ్యారిమనా మరణించారు.
లెచ్ కాజిన్స్కి, పోలాండ్ అధ్యక్షుడు
రష్యాలోని స్మోలెన్స్క్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అప్పటి పోలాండ్ అధ్యక్షుడు లెచ్ కాజిన్స్కి 2010లో విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 96మంది మరణించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జార్జియాపై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో లెచ్ కాజిన్స్కి మృతి వెనుక రష్యా ప్రభుత్వం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
అర్విడ్ లిండ్‌మాన్, స్వీడన్ ప్రధాన మంత్రి
సాలమన్ అర్విడ్ అచటెస్ లిండ్‌మాన్ రెండుసార్లు స్వీడన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 1936 డిసెంబర్ 9న ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. దట్టమైన పొగమంచు కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని క్రోయ్‌డాన్ విమానాశ్రయం సమీపంలో అర్విడ్ లిండ్‌మాన్ ప్రయాణిస్తున్న డగ్లస్ DC-2 విమానం ఇళ్లపైకి వెళ్లడంతో ఆయన మరణించారు.
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి.. ధృవీకరించిన స్థానిక మీడియా
నెరేయు రామోస్, బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసిన నెరేయు రామోస్ 1958 జూన్ 16న విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న రామోస్ క్రూజీరో డో సుల్ విమానం పరానా రాష్ట్రంలోని కురిటిబా అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది.
అబ్దుల్ సలామ్ ఆరిఫ్, ఇరాక్ అధ్యక్షుడు
ఇరాక్ రెండో అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ ఆరిఫ్ 1958లో రాచరికాన్ని కూలదోసిన విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1966 ఏప్రిల్ 13న ఆరిఫ్ అతని ఇరాకీ ఎయిర్ ఫోర్స్ విమానం డి హావిలాండ్ DH 104 డోవ్‌లో ప్రయాణిస్తుండగా బస్రా సమీపంలో కూలిపోయింది.
హంబర్టో డి అలెంకార్ కాస్టెలో బ్రాంకో, బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రెజిల్ 26వ అధ్యక్షుడు, మాజీ సైనిక నియంతృత్వంలో కీలక వ్యక్తి అయిన హంబెర్టో డి అలెంకార్ కాస్టెలో బ్రాంకో 1967 జూలై 18న మరణించారు. అతని అధ్యక్ష పదవి ముగిసిన కొద్దిసేపటికే విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
సెబాస్టియన్ పినెరా, చిలీ అధ్యక్షుడు
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పిమెరా ఈఏడాది ఫిబ్రవరిలో మరణించారు. పినెరా హెలికాప్టర్ దక్షిణ చిలీలోని సరస్సులో కూలిపోయింది. వరుసగా రెండు సార్లు చిలీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా పేరొందారు.
Iran: ఇరాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరు..?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest International News and Telugu News