Uttarpradesh: ఒక వైపు తోడేళ్లు, మరోవైపు నక్కలు.. యూపీ ప్రజలపై పెరుగుతున్న వన్యమృగాల దాడులు
ABN , Publish Date - Sep 08 , 2024 | 12:51 PM
ఉత్తరప్రదేశ్ ప్రజలను వన్యమృగాలు భయపెడుతున్నాయి. ఓ వైపు తోడేళ్లు గ్రామస్థుల ప్రాణాలు తీస్తుండగా తాజాగా నక్కలూ దాడులు చేస్తున్నాయి.
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ప్రజలను వన్యమృగాలు భయపెడుతున్నాయి. ఓ వైపు తోడేళ్లు గ్రామస్థుల ప్రాణాలు తీస్తుండగా తాజాగా నక్కలూ దాడులు చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే నక్కల దాడిలో12 మందిపైగా గాయపడ్డారు. ఈ ఘటన పిలిబిత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్సోలీ, సుస్వర్ గ్రామాల్లో ఇంటి బయట చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన ఓ నక్కల సమూహం పిల్లలపై విరుచుకుపడింది. విచక్షణ రహితంగా దాడి చేసింది. గమనించిన స్థానికులు పిల్లలను రక్షించేందుకు వెళ్లగా వారిపైనా అవి దాడికి దిగాయి. స్థానికులు వాటిని వెంబడించి ఓ నక్కను చంపేశారు.
గాయపడిన 12 మందిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ గ్రామాల్లోకి వన్యమృగాలు వస్తున్నాయని.. అధికారులు వాటిని బంధించి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తోడేళ్ల దాడులు..
జులై 17వ తేదీ నుంచి జిల్లాలో చిన్నారులపై తోడేళ్లు దాడి చేస్తున్నాయని బెహరాయిచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి ఇటీవలే తెలిపారు. తోడేళ్ల దాడుల్లో ఇప్పటి వరకు 8 మంది మరణించారని తెలిపారు. వారిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారన్నారు.
మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. తోడేళ్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులు బృందంగా ఏర్పడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆచూకీ కోసం డ్రోన్‌ల సహయం తీసుకుంటున్నామని వెల్లడించారు. చిన్నారులపై దాడి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని వివరించారు.
For Latest News click here