Share News

రోడ్లపై రక్త చరిత్ర

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:54 AM

దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

రోడ్లపై రక్త చరిత్ర

2023లో గంటకు 20 మంది దుర్మరణం

ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ నివేదిక

ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు

2022తో పోలిస్తే 4.2% పెరుగుదల

న్యూఢిల్లీ, నవంబరు 19: దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం గత ఏడాది 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు తెలిపింది. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో 4.2 శాతం మేరకు ప్రమాదాలు పెరిగాయని వివరించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రహదారులు మృత్యు మార్గాలుగా మారాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో సగటున గంటకు 55 చొప్పున వాహనాలు ఢీ కొంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా 1,457 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశంలో రోజుకు 26 మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గత ఏడాది 9,489 మంది ప్రాణాలు కోల్పోయారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,72,890 మంది చనిపపోయారు. 4,62,825మంది గాయపడ్డారు.

2022తో పోల్చుకుంటే మృతులు 2.6 శాతం, గాయాలపాలైన వారు 4.4 శాతం చొప్పున పెరిగారు.

రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 23,652 మంది, తమిళనాడులో 18,347 మంది, మహారాష్ట్రలో 15,366 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో 1,457 మంది చనిపోగా, తర్వాత స్థానాల్లో బెంగళూరు(915 మంది), జైపూర్‌(849 మంది) ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలిస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 2023లో 67,213 ప్రమాదాలు జరిగాయి.

మితిమీరిన వేగం కారణంగా 68.1 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే దాదాపు సగం మంది ఉన్నారు. మొత్తం మృతుల్లో వీరు 44.8 శాతం మంది ఉన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో పాదచారులు 20ు మంది ఉన్నారు.

రహదారుల లోపం కారణంగా 4.9 శాతం మంది, వాహనాలు ఢీ కొనడం ద్వారా 59.3 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది.

రహదారులపై మృతి చెందుతున్న వారిలో పురుషుల సంఖ్య 85.2 శాతంగా ఉండగా, మహిళల సంఖ్య 14.8 శాతంగా ఉంది.

రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణులు 68.4 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 31.5 శాతం మంది ఉన్నారు.

ప్రపంచ రహదారుల గణాంకాలు-2020 ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉంది.

Updated Date - Nov 20 , 2024 | 05:09 AM