Watch Video: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. తోటి ఆటగాళ్లు సీపీఆర్ చేసినా..
ABN , Publish Date - Jan 10 , 2024 | 03:42 PM
గత కొంతకాలం నుంచి గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా.. కరోనా లాక్డౌన్ తర్వాత హార్ట్ ఎటాక్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎల్లప్పుడూ హుషారుగా ఉండే వ్యక్తులు..
Noida Cricketer Heart Attack: గత కొంతకాలం నుంచి గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా.. కరోనా లాక్డౌన్ తర్వాత హార్ట్ ఎటాక్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎల్లప్పుడూ హుషారుగా ఉండే వ్యక్తులు సైతం దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒక వ్యక్తి క్రికెట్ ఆడుతూ.. మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన వికాస్ నేగి అనే 34 ఏళ్ల వ్యక్తి శనివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి మైదానానికి వెళ్లాడు. నోయిడాలోని సెక్టార్ 135లో నిర్మించిన స్టేడియంలో మావెరిక్-11, బ్లేజింగ్ బుల్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మావెరిక్-11 తరఫున బ్యాటింగ్ చేసేందుకు వికాస్ నేటి క్రీజులోకి వచ్చాడు. 14వ ఓవర్‌లో ఐదో బంతికి బ్యాటర్ బలమైన షాట్ కొట్టగా.. మరో ఎండ్‌లో నిలబడిన వికాస్ రన్ తీసుకోవడానికి పరుగెత్తాడు. అయితే.. ఆ బంతి బౌండరీ దాటి వెళ్లడంతో, వికాస్ తన తోటి ప్లేయర్‌ని అభినందించాడు. అనంతరం ఆ బ్యాటర్ వెనక్కు తిరిగి వెళుతుండగా.. ఇటు వికాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వికాస్ నేలపై పడిపోవడం చూసి.. తొలుత వికెట్ కీపర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లు గుమికూడి.. వికాస్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందని కొందరు గుర్తించి.. అతనికి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే వికాస్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో.. అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రికెట్ ఆడటానికి వెళ్లిన వెళ్లి విగతజీవిగా తిరిగి రావడం చూసి.. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.