కుంగదీస్తున్న మధుమేహం
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:14 AM
మధుమేహం.. శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తోందని.. 36 శాతం మంది బాధితులు కోపం, అపరాధ భావన, సిగ్గు, భయం, ఆందోళన, విచారం, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలకు గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
36 శాతం బాధితుల్లో మానసిక సమస్యలు
ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం,
సిగ్గు, విచారం వంటివాటితో తీవ్రంగా సతమతం
జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
పరీక్షలు చేయించుకుని జాగ్రత్తపడాలని సూచన
న్యూఢిల్లీ, నవంబరు 18: మధుమేహం.. శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తోందని.. 36 శాతం మంది బాధితులు కోపం, అపరాధ భావన, సిగ్గు, భయం, ఆందోళన, విచారం, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలకు గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీలోని హెన్రిచ్ హీన్ యూనివర్సిటీ, డసెల్‌ఫోర్డ్ పరిశోధకుల అధ్యయన నివేదిక లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. ‘‘మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? దీనివల్ల ఇంకా ఏమేం సమస్యలు వస్తాయో? అనే సందేహాలు.. జీవన నాణ్యత తగ్గిపోవడం, వైద్య ఖర్చులు పెరగడం, మందులు వాడుతున్నా చక్కెరస్థాయులు నియంతణ్రలోకి రాకపోవడం, ఆహారపుటలవాట్లను మార్చుకోవాల్సి రావడం, ఔషధ మోతాదు ఎక్కువై రక్తంలో చక్కెర స్థాయులు ఆందోళనకరస్థాయిలో పడిపోతాయన్న భయం వంటివి.. షుగర్ పేషెంట్లు మానసిక సమస్యలకు గురయ్యేలా చేస్తున్నాయి’’ అని నివేదికలో పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ కలిపి ‘డయాబెటిస్ డిస్ట్రె్‌స’గా వ్యవహరిస్తారు.
టైప్-1 లేదా టైప్-2.. ఏ రకం డయాబెటిస్ అయినా, జీవనశైలిలో మార్పుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. క్రమం తప్పకుండా మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, శారీరకంగా చురుగ్గా ఉండడం, ఆహారపుటలవాట్లను నియంత్రించుకోవడం వంటివి తప్పనిసరి. మానసిక ఆరోగ్యం అంతగా బాగుండని వారికి ఇవన్నీ సవాళ్లుగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వివరించారు. కాబట్టి, మధుమేహంతో బాధపడేవారు ‘డయాబెటిస్ డిస్ట్రెస్’ లక్షణాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, ముందే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ మానసిక సమస్యల ముప్పును గుర్తించిన అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్).. ఇన్సులిన్‌ను కనిపెట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2021లో మూడేళ్ల ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో పూర్తయింది. ఐడీఎఫ్ తాజా సర్వేలో మధుమేహ బాధితుల్లో 77ు మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. దీంతో 2024-26 దాకా కూడా ‘డయాబెటిస్ అండ్ వెల్‌బీయింగ్’ థీమ్‌తో ప్రపంచ మధుమేహ దినాన్ని నిర్వహించాలని ఐడీఎఫ్ నిర్ణయించింది.
నివేదికలో ముఖ్యాంశాలు
20 శాతం: సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. టైప్-1, టైప్-2 మధుమేహ బాధితుల్లో డిప్రెషన్ బారిన పడే ముప్పు 2-3 రెట్లు అధికం. వ్యాకులత, ఆదుర్దా, చింత వంటివాటితో బాధపడే ప్రమాదం 20 శాతం అధికం.
63 శాతం: డయాబెటిస్ బాధితుల్లో 63ు మంది.. దానివల్ల కాలక్రమంలో వచ్చే దుష్ప్రభావాలు, సమస్యల గురించిన ఆందోళన తమ ఆరోగ్యాన్ని ద్బెబతీస్తోందని పేర్కొన్నారు.
28 శాతం: మధుమేహ సమస్య ఉన్నవారిలో 28 శాతం మంది.. తమ పరిస్థితిపై సానుకూల భావనలు కలిగి ఉండడం కష్టంగా అనిపిస్తోందన్నారు.
అసాధారణ ఆహారపుటలవాట్లు
టైప్-1 మధుమేహంతో బాధపడేవారిలో ఈటింగ్ డిజార్డర్స్.. అంటే అసాధారణ ఆహారపుటలవాట్ల వచ్చే ముప్పు సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. టైప్-1 బాధిత మహిళల్లో ‘డయాబులీమియా’ సమస్య ఎక్కువగా ఉంటోంది. డయాబులీమియా అంటే.. బరువు తగ్గడం కోసం తీసుకునే ఇన్సులిన్ పాళ్లను తగ్గించేసుకోవడం. ఇక టైప్-2 మధుమేహుల్లో.. అతిగా తినేసే సమస్య అధికంగా కనిపిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.