Share News

56 degrees : నాగపూర్‌లో 56 డిగ్రీలు

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:37 AM

దేశంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ రికార్డును సమీపిస్తున్నాయి..! దేశవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బలతో 79 మంది మృతిచెందారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. నాగపూర్‌లో శుక్రవారం 56 డిగ్రీల

56 degrees : నాగపూర్‌లో 56 డిగ్రీలు

ప్రపంచ రికార్డుకు చేరువలో ఉష్ణోగ్రత

దేశంలో వడదెబ్బతో 79 మంది మృతి.. 25 మంది ఎన్నికల సిబ్బందే

ఉత్తరాదికి 3 రోజులు భారీ వర్షాలు.. ఢిల్లీ పరిసరాల్లో ధూళి తుపాను!

ఐఎండీ హెచ్చరిక.. జాతీయ విపత్తుగా ప్రకటించండి: రాజస్థాన్‌ హైకోర్టు

న్యూఢిల్లీ, మే 31: దేశంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ రికార్డును సమీపిస్తున్నాయి..! దేశవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బలతో 79 మంది మృతిచెందారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. నాగపూర్‌లో శుక్రవారం 56 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి రామదా్‌సపేట్‌లోని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌(ఏడబ్ల్యూఎ్‌స)లో ఈ మేరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత ప్రపంచ రికార్డుకు చేరువలో ఉండడం గమనార్హం..! 1913 జూలై 10న కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో 56.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత. నాగపూర్‌లోని సోనేగావ్‌లో ఉన్న మరో ఏడబ్ల్యూఎ్‌సలో కూడా శుక్రవారం అసాధారణంగా 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా.. ఇటీవల ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే..! ఢిల్లీ చరిత్రలోనే ఇది అత్యధికం కాగా.. అక్కడ వెదర్‌స్టేషన్‌లోని సెన్సర్‌ సరిగ్గా పనిచేస్తుందో? లేదో? తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడు నాగపూర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మరోమారు చర్చకు దారితీసింది. సోషల్‌మీడియాలో నెటిజన్లు ఏకంగా ఐఎండీని ‘‘ఇక్కడ కూడా సెన్సర్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయా’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

వడదెబ్బతో మరణాలు..

దేశంలో తీవ్రమైన ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశవ్యాప్తంగా వడదెబ్బతో 69 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లో అత్యధికంగా 32 మంది మృతిచెందగా.. వారిలో 10 మంది ఎన్నికల సిబ్బంది కావడం గమనార్హం..! ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న మరణాల్లో మరో 15 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 13 మంది మిర్జాపూర్‌లో, ఇద్దరు సోన్‌భద్రలో వడదెబ్బకు గురయ్యారు. ఒడిసాలో 14, తెలంగాణలో 10 మరణాలు నమోదయ్యాయి. ఝార్ఖండ్‌లో ఐదుగురు, రాజస్థాన్‌లో మరో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు, ఢిల్లీలో మరొకరు మృతిచెందారు. ఢిల్లీలో వడదెబ్బకు మృతిచెందిన వ్యక్తి బిహార్‌లోని దర్భంగాకు చెందినవాడని అధికారులు తెలిపారు. 40 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తికి ఒకేసారి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారిన్‌హీట్‌కు పెరిగిందని, ఆ తర్వాత అంతర్గత అవయవాలు పనిచేయక, చనిపోయినట్లు వివరించారు. ఝార్ఖండ్‌లో వడదెబ్బతో 1,326 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

వర్ష సూచనలు

నైరుతి రుతుపవనాలు కేరళ వ్యాప్తంగా విస్తరించాయని, కర్ణాటక, తమిళనాడులో రెండ్రోజుల్లో విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పశ్చిమ గాలులు, తుపాను కారణంగా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, ముజఫరాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో.. యూపీ, ఢిల్లీ, చండీగఢ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. కాగా, ఎండలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్‌ హైకోర్టు కేంద్రానికి సూచించింది. ఇటీవలి కాలంలో వడదెబ్బతో వందల మంది మృతిచెందారని, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వడగాలులు,శీతలగాలులతో మరణాల నియంత్రణ బిల్లు-2015ను ఈ సందర్భంగా ఉటంకించింది.


డేంజర్‌ బెల్స్‌

అడుగంటిపోతున్న జలాశయాలు

న్యూఢిల్లీ, మే 31: దేశంలోని ప్రధాన జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇతర ప్రాంతాల కంటే దక్షిణాదిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డేటా ప్రకారం దేశంలోని 150 రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటిమట్టాలు సగటున 23 శాతానికి పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి ఉన్న నీటి నిల్వలతో పోలిస్తే ఈ సారి 77 శాతం తక్కువ. గత వారం రిజర్వాయర్లలో దాదాపు 24 శాతం నీటిమట్టాలు ఉన్నాయి. వారంలోనే ఒక శాతం తగ్గాయి. ఇక దక్షిణాదిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి సహా ఇతర నదులపై నిర్మించిన 42 రిజర్వాయర్లలో ప్రస్తుతం 14 శాతం మాత్రమే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం నీటి నిల్వల సామర్థ్యం 53.334 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా, ప్రస్తుతం 7.317 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఈ సమయానికి ప్రధాన రిజర్వాయర్లలో 44.511 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వలు ఉండాలని, అయితే ఈ సారి గణనీయంగా తగ్గాయని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - Jun 01 , 2024 | 05:37 AM