Chhattisgarh: అబూజ్‌మడ్‌లో పేలిన తూటా.. 10 మంది మావోయిస్టుల మృతి
ABN , Publish Date - May 01 , 2024 | 04:56 AM
మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మడ్ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు.. కీలక నేతలు
ఏకే-47 తుపాకీ, ఇన్సాస్, పేలుడు పదార్థాలు సీజ్
50 రోజుల్లో ఏడో ఎన్‌కౌంటర్
4 నెలల్లో 91 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 250 మంది నక్సల్స్.. 125 మంది అరెస్ట్
10 మంది మావోయిస్టుల మృతి
చర్ల, ఏప్రిల్ 30: మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మడ్ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ కథనం ప్రకారం.. అభూజ్‌మడ్‌లో నక్సల్స్ కదలికలపై సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బలగాలు ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా సోమవారం రాత్రి నారాయణ్‌పూర్-కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని టేక్మెట-కాకుర్ గ్రామాల మధ్య అభూజ్‌మడ్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారు.
మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో అభూజ్‌మడ్ అడవుల్లోకి(కాల్పెర్ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో) బలగాలు వెళ్లగానే.. మావోయిస్టుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. దాంతో.. భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఉదయం 9 గంటల వరకు.. సుమారు మూడు గంటల పాటు ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోవడంతో.. బలగాలు ముందుకు చొచ్చుకువెళ్లాయి.
ఈ క్రమంలో 10 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు సుందర్‌రాజ్ తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలున్నట్లు వివరించారు. మృతులను గుర్తించాల్సి ఉందని, వీరిలో కీలక నేతలు ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. భద్రతాబలగాల వైపు ఎలాంటి నష్టం జరగలేదని, అభూజ్‌మడ్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక రివాల్వర్‌తోపాటు.. భారీగా మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యం, కిట్‌బ్యాగ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను నారాయణ్‌పూర్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వివరించారు.
పెరిగిన అరెస్టులు.. లొంగుబాట్లు
గడిచిన నాలుగు నెలల్లో దంతేవాడ, సుకుమా, బీజాపూర్ జిల్లాల్లో 250 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా సోమవారం 23 మంది, మంగళవారం 16 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మంగళవారం లొంగిపోయిన 16 మంది మావోయిస్టు కీలక నేత హిడ్మా నేతృత్వంలోని పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌కు చెందినవారు కావడం గమనార్హం..! ఇదిలా ఉండగా, ఛత్తీ్‌సగఢ్ సర్కారు చర్చలకు సిద్ధమంటూ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మా వోయిస్టులకు సంకేతాలిచ్చారు. ‘‘మావోయిస్టులు చిన్నగ్రూపులుగా వచ్చినా.. పెద్ద గ్రూపులుగా ఉన్నా.. చర్చలు జరపొచ్చు. మీ వెసులుబాటును బట్టి వీడియోకాల్ ద్వారా చర్చ లు జరపొచ్చు. లేదంటే.. మీ తరఫున ఓ మధ్యవర్తిని పంప ండి’’ అని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నాలుగు నెలల్లో 91 మంది మృతి
మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌తో కలిపి.. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్రతాబలగాల కాల్పుల్లో 91 మంది మావోయిస్టులు మృతిచెందారు. గడిచిన 50 రోజుల్లో జరిగిన ఏడు భారీ ఎన్‌కౌంటర్లు మావోయిస్టు శిబిరానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీ్‌సగఢ్‌తోపాటు పరిసర రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 29 మంది మృతిచెందారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లోని తెర్లాం/పూవర్తి మొదలుకుని, అభూజ్‌మడ్ వరకు 80 వేల మంది భద్రతా బలగాలతో 5 వేలకు పైగా క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు సేఫ్ జోన్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.