Jharkhand: హేమంత్ సోరెన్ సతీమణికి ఝార్ఖండ్ పగ్గాలు?
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:50 PM
ఝార్ఖండ్ సీఎంపై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలు ఆయన సతీమణికి బదిలీ కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సడెన్‌గా కనిపించకుండా పోయి కలకలం రేపారు. ఈడీ ఆయనను విచారించేందుకు వస్తున్న సమయంలో ఢిల్లీలో అకస్మాత్తుగా అదృశ్యమైన ఆయన నేటి మధ్యాహ్నం రాంచీలో కనిపించారు. ఆ తరువాత మొదటగా ఆయన తన జేఎమ్ఎమ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హేమంత్ సోరెన్ సతీమణి కల్పన సోరెన్ కూడా కనిపించడం అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతకుమునుపే ఝార్ఖండ్ రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ సోరెన్ తన భార్యకు పగ్గాలు అప్పగించేందుకు ప్రణాళిక వేస్తున్నారని ఆరోపించారు. దీంతో, జేఎమ్ఎమ్ ఎమ్మెల్యేల సమావేశంలో కల్పన సోరెన్ కనిపించడం కలకలానికి దారి తీసింది. ఈ నెల మొదట్లో జేఎమ్ఎమ్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో బీజేపీ ఎంపీ దూబే ఈ రాజీనామాపై స్పందిస్తూ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఈ నేపత్యంలో హేమంత్ సోరెన్ అరెస్టయితే కల్పన సోరెన్ సీఎం పగ్గాలు చేపడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సర్ఫరాజ్ రాజీనామా చేసిన స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ పరిణామాలు అనేక మందికి బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి సీఎం అయిన వైనాన్ని గుర్తుకు తెస్తున్నాయి.1997లో దాణా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సతీమణి రబ్రీ దేవి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అధికార కాంక్షతోనే ఆయన ఇలా చేశారంటూ అప్పట్లో లాలూ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.