Share News

ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో రవాణా వాహనం నడపొచ్చు

ABN , Publish Date - Nov 07 , 2024 | 05:21 AM

తేలికపాటి వాహనాల (లైట్‌ మోటార్‌ వెహికల్‌-ఎల్‌ఎంవీ) డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగినవారు రవాణా వాహనాలను కూడా నడపవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ఎలాంటి అధికారిక అంగీకారం అవసరం లేదని తెలిపింది. ఎల్‌ఎంవీ లెసెన్స్‌తో 7,500 కిలోల వరకు బరువు

ఎల్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో రవాణా వాహనం నడపొచ్చు

ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు

అయితే వాహనం బరువు 7,500 కేజీలకు మించకూడదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 6: తేలికపాటి వాహనాల (లైట్‌ మోటార్‌ వెహికల్‌-ఎల్‌ఎంవీ) డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగినవారు రవాణా వాహనాలను కూడా నడపవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ఎలాంటి అధికారిక అంగీకారం అవసరం లేదని తెలిపింది. ఎల్‌ఎంవీ లెసెన్స్‌తో 7,500 కిలోల వరకు బరువు ఉన్న వాహనాన్ని నడపవచ్చని తెలిపింది. డ్రైవర్ల జీవనోపాధి దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్‌ పంజక్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. గతంలో ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. తేలికపాటి మోటారు వాహనం నడిపేందుకు లైసెన్స్‌ ఉన్న వారు లోడు చేయని 7,500 కేజీల బరువు ఉన్న భారీ వాహనాన్ని నడిపేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని పేర్కొంది. ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో ‘లైట్‌ మోటార్‌ వెహికల్‌’ వర్గంగా గుర్తింపు పొందిన రవాణా వాహనాన్ని నడపవచ్చని తెలిపింది. ఈ తీర్పుపై 2022లో వేరే కేసును విచారించిన మరో త్రిసభ్య ధర్మాసనాని (కోఆర్డినేట్‌ బెంచ్‌)కి అనుమానం రావడంతో పరిశీలనకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాయింది. విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం కార్లు వంటి తేలికపాటి వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు 7,500 కిలోల లోపు ఉన్న రవాణా వాహనాలను నడపవచ్చని తెలిపింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ రాయ్‌ తీర్పు రాశారు. లైసెన్సింగ్‌ విషయానికి వస్తే తేలికపాటి వాహనాలు, రవాణా వాహనాలను రెండు వేరువేరు వర్గాల కింద చూడాల్సిన పనిలేదని తెలిపింది. అటూ ఇటూ ఉపయోగిస్తుంటారని పేర్కొంది. అయితే ఈ-రిక్షాలు, ఈ-కార్ట్స్‌, ప్రమాదకర వస్తువులు రవాణా చేసే వాహనాలను నడిపే వారు మాత్రం ప్రత్యేకంగా లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - Nov 07 , 2024 | 05:21 AM