Share News

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

ABN , Publish Date - May 07 , 2024 | 03:11 AM

గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

  • ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నోట్ల కలకలం

  • మంత్రి ఆలంగిర్‌ పీఎస్‌ పనిమనిషి ఇంట్లో ఈడీ సోదాలు

  • గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు

  • నిరుడు 10 వేలు లంచం కేసులో పట్టుబడ చీఫ్‌ ఇంజనీర్‌

  • అతడు ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల ఈడీ దాడులు

  • పనిమనిషి ఇంటినే అవినీతి గోడౌన్‌గా మార్చేశారు

  • కాంగ్రెస్‌ యువరాజు సమాధానం చెప్పాలి: ప్రధాని మోదీ

  • పని మనిషి ఇంట్లో రూ.34 కోట్లు

రాంచి, మే 6: గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు. ఝార్ఖండ్‌లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) ఇంట్లో పని చేసే వ్యక్తి వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇది దాదాపు రూ.34 కోట్లని.. ఇదంతా లెక్కల్లోకి రాని అక్రమ సొమ్మేనని అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా మరో చోట రూ.3 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేసిన వీరేంద్రకుమార్‌ రామ్‌ గతేడాది రూ.10 వేల లంచం కేసులో అరెస్ట్‌ అయ్యారు.


అయితే, ఆ తర్వాత మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నాక సీన్‌ మారిపోయింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్‌ ఆలం పీఎస్‌ సంజీవ్‌లాల్‌ ఇంట్లో పని మనిషిగా ఉన్న జహంగీర్‌ ఆలం అనే వ్యక్తి నివాసంలో కూడా సోదాలు జరిగాయి.


అక్కడ రూ.500 నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడటం కలకలం రేపింది. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ ఈ వ్యవహారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఝార్ఖండ్‌లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పనిమనిషి ఇంటినే అవినీతి గోడౌన్‌గా మార్చారు. నగదు లెక్కింపు యంత్రాలే అలిసిపోయేంతగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్‌ ప్రథమ కుటుంబం తాలుకూ నల్లధనమేనా..? దీనిపై యువరాజు సమాధానం చెప్పాలి’ అని మోదీ ప్రశ్నించారు.

Updated Date - May 07 , 2024 | 03:11 AM