Kejriwal : కాంగ్రెస్‌తో బంధం శాశ్వతం కాదు
ABN , Publish Date - May 30 , 2024 | 06:01 AM
కాంగ్రెస్ పార్టీతో తమ బంధం శాశ్వతం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే ఈ రెండు పార్టీలూ దగ్గరయ్యాయని చెప్పారు. ఒక ఆంగ్ల టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం
ఇండియా కూటమిదే గెలుపు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మే 29: కాంగ్రెస్ పార్టీతో తమ బంధం శాశ్వతం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే ఈ రెండు పార్టీలూ దగ్గరయ్యాయని చెప్పారు. ఒక ఆంగ్ల టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని, ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించబోతోందని తెలిపారు. ఢిల్లీలో కలిసి పోటీచేస్తున్న కాంగ్రెస్, ఆప్ పంజాబ్‌లో మాత్రం విడివిడిగా పోటీ చేయడంపైనా కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. ‘కాంగ్రె్‌సతో ఆప్‌ది శాశ్వత వివా హ బంధమేమీ కాదు. బీజేపీని ఓడించడం, ప్రస్తుత పాలకుల నియంతృత్వాన్ని, గూండాయిజాన్నీ అంతమొందించడమే ప్రస్తుతం మా లక్ష్యం. దేశాన్ని కాపాడటమే ఇప్పుడు కీలకం. బీజేపీని ఓడించడానికి ఎక్కడైతే కూటమి కట్టడం అవసరమో అక్కడే ఆప్, కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలిపాయి. పంజాబ్‌లో బీజేపీకి అసలు ఉనికే లేదు. అందుకే అక్కడ మేం కాంగ్రె్‌సతో కూటమి కట్టలేదు’ అని తేల్చిచెప్పారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలనూ తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎంతకాలం జైల్లో ఉంచినా తలవంచను
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. ‘నేను తిరిగి జైలుకు వెళ్లడం ఇక్కడ ముఖ్యంకాదు. దేశ భవిత ప్రమాదంలో ఉంది. వారు నన్ను ఎంతకాలం జైల్లో ఉంచినా తలవంచను. బీజేపీ కోరుతున్న ఒకే ఒక్క కారణంతో నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశాన్ని కాపాడటానికి జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు. కేం ద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే గనుక దేశంలోని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలందరినీ జైల్లో పెడతారని, రష్యా లో పుతిన్ పాలనలాగే మనదేశంలోనూ రాజకీయ పరిస్థితి తయారవుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జైల్లో ఉన్న ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లకు బీజేపీలో చేరాలని సందేశాలొస్తున్నాయని, ప్రతిఫలంగా వారికి బెయిల్‌ను ఆఫర్ చేస్తున్నారని తెలిపారు.
100 సార్లైనా జైలుకెళ్తా..
దేశం కోసం వంద సార్లైనా జైలుకె ళ్లేందుకు తాను సిద్ధమని కేజ్రీవాల్ బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ అడుగుజాడల్లో నడిచేవాడినని చెప్పారు. తాను అవినీతికి పాల్పడ్డాడని వారు(బీజేపీ) అంటున్నా రని, వారి వద్ద ఒక్క ఆధారం కూడా లేదని ఆయన అన్నారు.
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బుధవారం సుప్రీం కోర్టులో నిరాశ ఎదురయింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.