Share News

Swati Maliwal Vs AAP: ద్రోహి ఎవరో కాలమే చెబుతుంది.. స్వాతి మలివాల్‌పై 'ఆప్' ఎదురుదాడి

ABN , Publish Date - May 17 , 2024 | 07:54 PM

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారం ముదురుతోంది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్‌ చేసిన ఆరోపణలపై తొలుత ఆమెకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన 'ఆప్' తాజాగా ఆమెపై గుర్రుమంటోంది. ఈ వివాదాన్ని స్వాతి మలివాల్ పొడిగిస్తూ పోతుండటంతో ఆమెకు, ఆప్‌కు మధ్య 'మాటల యుద్ధం' ముదురుతోంది.

Swati Maliwal Vs AAP: ద్రోహి ఎవరో కాలమే చెబుతుంది.. స్వాతి మలివాల్‌పై 'ఆప్' ఎదురుదాడి

న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి వ్యవహారం ముదురుతోంది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్‌ చేసిన ఆరోపణలపై తొలుత ఆమెకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన 'ఆప్' (AAP) తాజాగా ఆమెపై గుర్రుమంటోంది. ఈ వివాదాన్ని స్వాతి మలివాల్ పొడిగిస్తూ పోతుండటం, ''హిట్ మ్యాన్'' అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు, ఆప్‌కు మధ్య 'మాటల యుద్ధం' ముదురుతోంది. అబద్ధాలు, అహంకారం ఎవరిదో, ఎవరు విధేయులో, ఎవరు ద్రోహులో కాలమే చెబుతుందని, సత్యం వెలుగుచూడక మానదని 'ఆప్' నేత దిలీప్ పాండే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్వాతి మలివాల్‌‌పై మండిపడ్డారు. ''అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్...ఆయన పోరాడి గెలుస్తారు'' అని ట్వీట్ చేశారు.


''స్వాతి మలివాల్ కా సచ్''.. వీడియోలో ఏముంది?

''స్వాతి మలివాల్ కా సచ్'' అనే శీర్షికతో శుక్రవారం ఒక వీడియో సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయింది. ఇది ఒక్కసారిగా వైరల్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని వీడియోగా దీనిపై కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ అధికారిక నివాసంలో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్ వాదిస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది. తాను పోలీసులను ఇప్పటికే పిలిచానని, వారు వచ్చిన తర్వాతే వెళ్తానని ఆందులో ఆమె పేర్కొన్నట్టు వినిపిస్తోంది. ''మీరు నన్ను టచ్ చేస్తే మీ ఉద్యోగాలను నేను ఊడగొట్టడం ఖాయం'' అని కూడా ఆ వీడియోలో ఆమె భద్రతా సిబ్బందితో అనడం వినిపిస్తోంది.

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్


'హిట్ మ్యాన్' వ్యాఖ్యలు...

కేజ్రీవాల్ ఇంటి నుంచి వెలువడినట్టు చెబుతున్న తాజా వీడియోపై మరోసారి స్వాతి మలివాల్ మండిపడ్డారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఈ రాజకీయ ''హిట్ మ్యాన్'' తనను తాను రక్షించుకునేందురకు ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు విషయం చూపించకుండా పోస్ట్‌లు, వీడియోలు విడుదల చేయడం ద్వారా తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే అసలు విషయాలను ప్రపంచం ముందుకు వస్తాయని, ఎవరు ఎంత దిగజారిపోయినా పైనుంచి దేవుడు చూస్తాడని స్వాతి మలివాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ''హిట్ మ్యాన్'' ఎవరో ఆమె చెప్పలేదు. కాగా, ఈ కేసు ఒక కుట్ర అని, బిభవ్‌ మంచి వ్యక్తని పంజాబ్ మంత్రులు ఇప్పటికే సీఎం వ్యక్తిగత సహాయకుడిని సమర్ధించగా, తాగాగా మరికొందరు 'ఆప్' నేతలు సైతం స్వాతి మలివాల్‌ ''హిట్ మ్యాన్'' వ్యాఖ్యలపై స్వరం పెంచుతున్నారు.

For More National News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 07:56 PM