Swara Bhaskar: నా భర్త ఓటమికి ‘99 శాతం చార్జింగ్’ ఈవీఎంలు కారణం.. ప్రముఖ నటి ఆరోపణ
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:48 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త ఫహాద్ అహ్మద్ ఓటమి చెందడంపై నటి స్వరా భాస్కర్ స్పందించారు. ఫహాద్ ఓటమికి ఈవీఎంలు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త ఫహాద్ అహ్మద్ ఓటమి చెందడంపై నటి స్వరా భాస్కర్ స్పందించారు. ఫహాద్ ఓటమికి ఈవీఎంలు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఫహాద్ అహ్మద్ ఎన్సీపీ (ఎస్సీపీ) తరపున అనుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అయితే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత సనా మలిక్ చేతిలో 3378 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఫహాద్‌కు 45,963 ఓట్లు పోలవగా సనాకు 49,341ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫహాద్ రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు. బీజేపీ ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు (Maharashtra).
Maharashtra Elections: ‘మహా’ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. బీజేపీ కొత్త తిప్పలు
మరోవైపు, స్వరా కూడా తన భర్త ఓటమికి ఈవీఎంలో లోపాలు కారణమని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఓ పోస్టు పెట్టారు. ‘‘అనుశక్తి నగర్ నియోజకవర్గంలో ఫహాద్ తొలి నుంచీ ఆధిపత్యంలో కొనసాగారు. కానీ 17, 18, 19 రౌండ్ల తరువాత 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అప్పటి నుంచీ అజిత్ పవార్ ఎన్సీపీ నేత ముందంజలోకి వచ్చారు. అసలు రోజంతా ఓటింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలలో చార్జింగ్ 99 శాతం ఎలా ఉంటుంది? 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలో ఓట్లు బీజేపీ, దాని మిత్రపక్షాలు ఖాతాలోకి ఎలా చేరాయి?’’ అని ఆమె ప్రశ్నించారు. అంతా పద్ధతి ప్రకారం జరిగితే ప్రజాతీర్పు శిరసావ హించేందుకు తాము సిద్ధమేనని అన్నారు.
అంతకుమునుపు పహాద్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 99 శాతం చార్జింగ్ ఈవీఎం ఓట్ల లెక్కింపు సందర్భంగా సనా ముందంజలో ఉన్నారు. తక్కువ బ్యాటరీ ఉన్న ఈవీఎంల విషయంలో ఆమె వెనుకంజలో ఉండిపోయారు’’ అని ఆయన ఆరోపించారు.
Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనం..
కాగా, హర్యానా ఎన్నికల్లో తమ ఓటమికి 99 శాతం చార్జింగ్ ఈవీఎంలు కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై అప్పట్లోనే స్పందించిన ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. బ్యాటరీ ఓల్టేజీ లేదా సామర్థ్యానికి ఓట్ల లెక్కింపునకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ‘‘బ్యాటరీలోని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 7.4 వోల్టు నుంచి 8 వోల్టులు మధ్య ఉన్నంతవరకూ డిస్‌ప్లే యూనిట్‌పై 99 శాతం చార్జింగ్ అని చూపిస్తుంది. ఈ పొటెన్షియల్ వద్ద బ్యాటరీ ఎంత ఉందో పూర్తిస్థాయిలో డిస్‌ప్లేపై కనిపించదు. అయినా, ఈవీఎం బాగానే పనిచేస్తుంది’’ అని ఈసీ వివరణ ఇచ్చింది.
ఇక ఎన్సీపీ (ఎస్సీపీ)లో చేరకమునుపు ఫహాద్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర యువజన సభ అధ్యక్షుడిగా ఉన్నారు. అలీగఢ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఫహాద్ ఆ తరువాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఎమ్‌ఫిల్ చేశాడు. విద్యార్థి రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు.