గంధమాదన పర్వత సమీపంలో అదానీ మైనింగ్?
ABN , Publish Date - Nov 22 , 2024 | 06:35 AM
అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు ప్రకంపనలు ఒడిశాలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని పవిత్ర గంధమర్దన (గంధమాదన) పర్వతాల సమీపంలో ఆ సంస్థ భూములు కొనుగోలు
నిలదీసిన ఒడిశా విపక్షాలు
భువనేశ్వర్, నవంబరు 21: అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు ప్రకంపనలు ఒడిశాలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని పవిత్ర గంధమర్దన (గంధమాదన) పర్వతాల సమీపంలో ఆ సంస్థ భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బర్‌గఢ్, బలాంగిర్ జిల్లాలతో కూడిన ఆ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు యోచిస్తున్నారా అని విపక్ష బిజూ జనతాదళ్ (బీజేడీ), కాంగ్రెస్ పార్టీలు గురువారం నిలదీశాయి. అయితే అలాంటిదేమీ లేదని.. అటవీకరణతో స్థానిక పర్యావరణాన్ని మెరుగుపరచడం కోసమే భూములు కొన్నామని.. ఇందులో వాణిజ్యమైన ఉద్దేశాలేమీ లేవని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది. బీజేడీ అధికారంలో ఉండగా.. గంధమాదన పర్వత ప్రాంతాన్ని నిరుడు జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా ప్రకటించారు. ఈ పర్వతాల్లో 207 మిలియన్ టన్నుల బాక్సైట్ గనులు ఉన్నట్లు అంచనా. దీని సమీపంలో అదానీ భూములు కొనడంలోని ఆంతర్యమేంటో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బోలంగీర్ బీజేడీ ఎమ్మెల్యే కలికేశ్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టివేశారు. ఇక్కడ మైనింగ్ యోచనే లేదని స్పష్టంచేశారు. మైనింగ్ కోసం అంగుళం భూమి కూడా ఇవ్వబోమని బీజేపీ ఎంపీ ప్రదీప్ తేల్చిచెప్పారు. మరోవైపు.. మైనింగ్ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది.