Share News

Mumbai: సముద్ర తీరాల్లో మరింత పటిష్టంగా నిఘా.. డ్రోన్లతో అణువణువు జల్లెడ

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:04 PM

సముద్ర తీరాల్లో భద్రతను పటిష్టపరిచేందుకు ముఖ్యంగా ముంబై, గోవా తీర ప్రాంతాలలో డ్రోన్ నిఘా వ్యవస్థలను అమలు చేయాలని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. కువైట్ నుండి ముగ్గురు వ్యక్తులు గేట్‌వే ఆఫ్ ఇండియాకు అక్రమంగా చేరుకున్న ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Mumbai: సముద్ర తీరాల్లో మరింత పటిష్టంగా నిఘా.. డ్రోన్లతో అణువణువు జల్లెడ

ముంబై: సముద్ర తీరాల్లో భద్రతను పటిష్టపరిచేందుకు ముఖ్యంగా ముంబై, గోవా తీర ప్రాంతాలలో డ్రోన్ నిఘా వ్యవస్థలను అమలు చేయాలని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. కువైట్ నుండి ముగ్గురు వ్యక్తులు గేట్‌వే ఆఫ్ ఇండియాకు అక్రమంగా చేరుకున్న ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో నిఘా వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని.. భద్రతాదళ అధికారి ఒకరు అన్నారు. నిట్సో డిట్టో, విజయ్ వినయ్ ఆంథోనీ, జె సహాయట్టా అనిష్ అనే ముగ్గురు వ్యక్తులు కువైట్‌లోని తమ యజమానిని మోసం చేసి సముద్ర మార్గంలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాకు చేరుకున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకుగానూ వారిని పోలీసులు అరెస్టు చేశారు.

పటిష్ట నిఘా లేకపోతే సముద్ర మార్గంలో దేశ వ్యతిరేక శక్తులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశమూ లేకపోలేదు. అలా అని తీర ప్రాంతం మొత్తం భద్రతా సిబ్బంది గస్తీ కాయలేరు. దీనికి పరిష్కారంగా డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. నవంబర్ 26, 2008న ముంబైలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించి, 166 మందిని పొట్టనబెట్టుకున్న విషాద ఘటనలను గుర్తుచేసుకుంటూ, తీరప్రాంత నిఘాను పటిష్టపరచాల్సిన ఆవశ్యకతను అధికారులు నొక్కి చెబుతున్నారు.


మహారాష్ట్రలోని 652.6 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని, గోవాలోని 101.0 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యవేక్షించడానికి సుదూర డ్రోన్‌ల విస్తరణ తప్పనిసరి అని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఫీచర్లతో సహా అధునాతన సామర్థ్యాలతో కూడిన డ్రోన్‌లను ఇందుకోసం ఉపయోగించాలని భావిస్తున్నాయి. పొరుగు దేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాలి.

రాత్రిపూట లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సముద్ర తీరంలో నిఘా కోసం థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యాలతో కూడిన డ్రోన్‌లు అవసరం. అధునాతన ట్రాకింగ్ సామర్థ్యాలతో కూడిన డ్రోన్‌లు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) కలిగిన నౌకలను గుర్తించి వాటి కదలికలను ట్రాక్ చేయగలవని అధికారులు భావిస్తున్నారు. భారత్‌కు 7,516 కి.మీ.ల తీర ప్రాంతం ఉంది. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలవెంట తీరప్రాంతం విస్తరించి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 01:06 PM