అఘాడీలో మహా చిచ్చు!
ABN , Publish Date - Mar 28 , 2024 | 03:56 AM
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు తీవ్రమయ్యాయి. ముంబైలోని ఐదు లోక్‌సభ స్థానాలు సహా 17 ఎంపీ సీట్లకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
ఉద్ధవ్ సేన తీరుపై కాంగ్రెస్, పవార్ గుర్రు
17 ఎంపీ స్థానాలకు ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటనపై ఆగ్రహం
ముంబై, మార్చి 27: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు తీవ్రమయ్యాయి. ముంబైలోని ఐదు లోక్‌సభ స్థానాలు సహా 17 ఎంపీ సీట్లకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. వీటిలో ముంబై సౌత్ సెంట్రల్, వాయవ్య ముంబై, సాంగ్లీ, భివండీ స్థానాలపై కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతుండగా.. భివండీ సీటు కోసం పవార్ ఎన్‌సీపీ కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో 48 లోక్‌సభ స్థానాలుం డగా వీటిలో 22 స్థానాల్లో పోటీచేస్తానని ఉద్ధవ్ సేన ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ 16, పవార్ ఎన్‌సీపీ 10, స్వాభిమానీ షేత్కారీ సంఘటన్‌కు ఒకటి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పోటీచేసే స్థానాలపై ఓపక్క చర్చలు జరుగుతుండగానే ఉద్ధవ్ సేన 17మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితా ప్రకటించింది. దీనిపై ముంబై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ మండిపడ్డారు. ముంబైలోని ఐదు స్థానాల్లో పోటీచేయడం ద్వారా కాంగ్రె్‌సను కాళ్లబేరానికి తీసుకురావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని.. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. కాంగ్రె్‌సను కాపాడుకోవాలంటే తక్షణమే దానితో తెగతెంపులు చేసుకోవాలని బుధవారం అధిష్ఠానాన్ని డిమాండ్‌చేశారు. వాయవ్య ముంబై నుంచి పోటీచేయాలని ఆయన భావిస్తున్నారు. ఇక్కడ ఉద్ధవ్ సేన అమోల్ కీర్తికర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సీటు వ్యవహారంలో వారం వేచిచూస్తానని.. తర్వాత తన నిర్ణయం తీసుకుంటానని నిరుపమ్ అన్నారు.
ఆయన బీజేపీ కూటమిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే వాయవ్య ముంబైని వదులుకోవడానికి కాం గ్రెస్ సుముఖంగానే ఉంది. కానీ సాంగ్లీ, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను ఇచ్చేందుకు ససేమిరా అం టోంది. సాంగ్లీలో మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనవడు విశాల్ పాటిల్‌ను, సౌత్ సెంట్రల్‌లో ముంబై పీసీసీ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్‌ను బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తుండగానే.. ఉద్ధవ్ సేన తన అభ్యర్థులను ప్రకటించడాన్ని రాష్ట్ర కాం గ్రెస్ నేతలు సహించలేకపోతున్నారు. ఈ రెండు సీట్లలో పాలక మహాయుతి కూటమి (బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్‌సీపీ)తో తలపడే సత్తా ఉద్ధవ్ సేనకులేదని.. అవసరమైతే ఈ రెండుచోట్ల స్నేహపూర్వక పోటీలకు దిగాలని భావిస్తున్నారు. కాగా అఘాడీలో చిచ్చుకు కాంగ్రెసే కారణమని రాజకీయవర్గాలంటున్నాయి. కొల్హాపూర్ స్థానం లో కొల్హాపూర్ రాజవంశానికి చెందిన షాహు మహరాజ్ ఛత్రపతిని అఘాడీ తన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. షాహును తన ఎన్నికల గుర్తుపై పోటీచేయించాలని ఉద్ధవ్‌సేన భావించింది. అయితే కాంగ్రెస్ తన హస్తం గుర్తుపై పోటీచేసేందుకు ఆయన్ను ఒప్పించింది. తమతో స్నేహం నెరపుతూనే దొంగ దెబ్బతీయడానికి కాంగ్రెస్ తెరచాటు ప్రయత్నాలు చే యడంపై ఉద్ధవ్‌సేన గుర్రుగా ఉంది. రాష్ట్రంలో కాం గ్రెస్, పవార్ ఎన్‌సీపీకి కలిపి 34ు ఓట్లుండగా.. ఉద్ధ వ్‌సేన కలిస్తే 40ుపైనే ఓట్లు వచ్చే అవకాశముంది. వాస్తవానికి ఈ 3పార్టీలు ఒకదాని బలం పై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ముంబైలో సీట్లు గెలవాలంటే ఉద్ధవ్‌సేనకు కాంగ్రెస్ మద్దతు, మరాఠ్వాడా ప్రాం తంలో పాలక కూటమిని దెబ్బతీయాలంటే కాంగ్రె్‌స కు ఉద్ధవ్‌సేన, పవార్ ఎన్‌సీపీల సహకారం కావాలి.
ఎంవీఏతో పొత్తు లేదు
మహా అఘాడీకి బాబాసాహెబ్ అంబేడ్క ర్ మనవడు, వంచిత్ బహుజన్ ఆఘాడీ (వీబీఏ)అధినేత ప్రకాశ్ అంబేడ్కర్ గట్టి షాకిచ్చారు. దానితో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదన్నారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు వీబీఏను వాడుకోవాలని ఎంవీఏ చూస్తోందని విమర్శించారు. మొదటి, రెండు దశల్లో పోలింగ్ జరిగే 13 స్థానాల్లో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అకోలా నుంచి ఆయనే బరిలోకి దిగుతున్నారు. వీటిలో ఇప్పటికే కాంగ్రెస్, ఉద్ధవ్ సేన తమ తమ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. ఆయన నిర్ణయం దురదృష్టకరమని మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ తోరట్ వ్యాఖ్యానించారు.