Share News

మయన్మార్‌లో యాగీ తుఫాను బీభత్సం

ABN , Publish Date - Sep 18 , 2024 | 06:27 AM

యాగీ టైఫూన్‌ మయన్మార్‌లో విధ్వంసం సృష్టించింది. పెను తుఫాను ప్రభావంతో వరదలు పొటెత్తడంతోపాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు దాదాపు 226 మంది ప్రాణాలు

మయన్మార్‌లో యాగీ తుఫాను బీభత్సం

226 మంది మృతి

బ్యాంకాక్‌, సెప్టెంబరు 17: యాగీ టైఫూన్‌ మయన్మార్‌లో విధ్వంసం సృష్టించింది. పెను తుఫాను ప్రభావంతో వరదలు పొటెత్తడంతోపాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోగా 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది. తుఫాను బీభత్సానికి దాదాపు 6.31 లక్షల మంది ప్రభావితులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సుమారు 1.60 లక్షల ఇళ్లు ధ్వంసం కాగా లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఆహారం, నీరు, సరైన ఆశ్రయం లేక అల్లాడుతున్నారని ఐరాసకు చెందిన మానవతా సహాయ సంస్థ వెల్లడించింది. మరోవైపు యాగీ టైఫూన్‌ ఆగ్నేయాసియా దేశాలను బెంబెలెత్తించింది. ముఖ్యంగా వియత్నాం, థాయ్‌లాండ్‌, లావోస్‌ దేశాలపై టైఫూన్‌ తీవ్ర ప్రభావం చూపింది. యాగీ ధాటికి వియత్నాంలో 300 మంది ప్రాణాలు కోల్పోగా, థాయ్‌లాండ్‌లో 42 మంది మృతిచెందారు. కాగా, టైఫూన్‌ ప్రభావానికి గురైన వియత్నాం, మయన్మార్‌, లావోస్‌ దేశాలకు భారత్‌ సాయాన్ని ప్రకటించింది. ఆపరేషన్‌ ‘సద్భవ్‌’ పేరిట నిత్యావసర వస్తువుల్ని, ఇతర సామగ్రిని ఇచ్చి ఆదుకొంది.

Updated Date - Sep 18 , 2024 | 06:27 AM