Share News

Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:09 PM

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను తీహాడ్ జైలు ఉన్నతాధికారులు ఖండించారు.

Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్
Delhi Chief Minister Arvind Kejriwal

న్యూఢిల్లీ, జులై 15: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal) ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చేసిన ఆరోపణలను తీహాడ్ జైలు ఉన్నతాధికారులు(Tihar Jail authorities) ఖండించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన నివేదికను సోమవారం విడుదల చేశారు. వైద్యులు సూచించినట్లుగా.. ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని మాత్రమే కేజ్రీవాల్ తీసుకుంటున్నారని తెలిపారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి జులై 14వ తేదీ మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 2 కేజీల బరువు తగ్గారని చెప్పారు. ఆయన బరువుకు సంబంధించిన రోజు వారీ నివేదికను ఈ సందర్భంగా జైలు ఉన్నతాధికారులు విడుదల చేశారు. కేజ్రీవాల్ శరీరంలోని అన్ని అవయువాలు సక్రమంగా పని చేస్తున్నాయన్నారు.


అదీకాక జైల్లోని ఖైదీల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటామన్నారు. ఆ క్రమంలో వైద్యుల సూచనలు, సలహాలు తప్పక పాటిస్తామన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వాదనలు.. వాస్తవానికి పూర్తి విరుద్దంగా ఉన్నాయని జైలు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా వారు చేస్తున్న ఆరోపణల వెనుక నిగూఢ ఉద్దేశ్యాలున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఇక కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహాడ్ జైలు ఉన్నతాధికారులు స్పందనపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు.

జైలు అధికారులు విడుదల చేసిన ఈ నివేదికతో తాము ఏకీభవించడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలు అధికారులు నివేదిక విడుదల చేసి.. నేరం చేశారని మండిపడ్డారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఏయిమ్స్) వైద్యుల బృందం పరీక్షించింది ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కేజ్రీవాల్ బాగా బరువు తగ్గారని.. అలాగే హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నారని వారు చెప్పారన్నారు.


ఇక కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు బాగా తగ్గిపోయాయని... అలా అయిదుసార్లు జరిగిందని వారు చెప్పారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మరణపు అంచుల్లోకి వెళ్తారన్నారు. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆయన అరెస్ట్ అయిన రోజు 70 కేజీల బరువు ఉన్నారన్నారు. ప్రస్తుత ఆయన 61.5 కేజీల బరువు ఉన్నారని తెలిపారు. కేజ్రీవాల్ జీవితంతో ఆటలాడుకోవద్దని ఈ సందర్బంగా ప్రధాని మోదీకి హితవు పలికారు. ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే .. సమాధానం ఇచ్చేందుకు కేంద్రం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని పరోక్షంగా మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆదివారం విలేకర్ల సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను తీహాడ్ జైల్లో అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే.. అందుకు కేంద్రంలోని మోదీ సర్కారుదే బాధ్యత అని స్పష్టం చేశారు. అలాగే ఈ సమావేశంలో అతిషితోపాటు వైద్యులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని వారు వివరించారు.


అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసులో ఆయన్నీ సీబీఐ సైతం అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికినా.. సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో ఆయన తీహాడ్‌ జైల్లోనే ఉన్నారు. అదీకాక.. ఇటీవల ట్రయిల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

దీనిపై ఈడీ..ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆ బెయిల్ కాస్తా ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 02:09 PM