Delh CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక.. ప్రకటించిన కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 17 , 2024 | 11:42 AM
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా మంత్రి అతిషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా మంత్రి అతిషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది. సీఎల్పీ నేతగా ఆమెను ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అతిషి పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభా పక్ష నేతగా అతిషి ఎంపికయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడమే తరువాయి.
ఆప్ ప్రభుత్వంలో కీలక పాత్ర..
అతిషి ప్రస్తుతం విద్య శాఖతో పాటు పలు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె చదువుకున్నారు. ఢిల్లీలో పాఠశాలల్లో విద్య వ్యవస్థను మెరుగుపరచడానికి ఆప్ ప్రభుత్వం చేసిన కృషిలో ఆమె కీలకంగా వ్యవహరించారు. కల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యాక ఆమె మంత్రి అయ్యారు. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలులో ఉన్నప్పుడు ఆమె పార్టీని నడిపించారు. ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అతిషిని కేజ్రీవాల్ ఎంచుకున్నారు.
మరోవైపు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను అందజేయనున్నారు.