కల్యాణ వైభోగమే
ABN , Publish Date - Dec 01 , 2024 | 02:43 AM
ఖర్చుకు తగ్గేదేలే. పెళ్లి వేడుక అదిరిపోవాలి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం వివాహం చేసుకునే జంటల్లో కనిపిస్తోంది.
పెళ్లి ఖర్చు ఎంతైనా తగ్గేదేలే.. దేశంలో వివాహ సగటు బడ్జెట్ 36.5 లక్షలు
గతేడాది కంటే 7 శాతం పెరుగుదల
వేదికలు, కేటరింగ్‌కే ఖర్చు ఎక్కువ
2 నెలల్లో రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం
వెడ్‌మీగుడ్ సంస్థ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 30: ఖర్చుకు తగ్గేదేలే. పెళ్లి వేడుక అదిరిపోవాలి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం వివాహం చేసుకునే జంటల్లో కనిపిస్తోంది. వివాహ వేడుకను జీవితంలో ఓ మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి ఖర్చుకు వెనుకాడటం లేదు. వివాహ వేడుకల తీరు కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లతో హడావుడి కూడా బాగా పెరిగింది. అలాగే బడ్జెట్ కూడా పెరిగింది. వేలు, లక్షలు దాటి కోట్లకు చేరింది. ఇటీవలే మనం చూశాం.. మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కల్యాణాన్ని న భూతో న భవిష్యతి అన్నట్లే చేశారు. ఈ పెళ్లికి సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు అయిందని అంచనా వేశారు. వివాహం అద్వితీయంగా చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఈ ఏడాది భారతీయుల వివాహ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. అది సగటున రూ. 36.5 లక్షలకు పెరిగిందని వెడ్‌మీగుడ్ అనే వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే సగటున రూ. 51 లక్షలుగా ఉందని ఆ కంపెనీ తెలిపింది.
గతేడాది కంటే ఇది 7 శాతం పెరిగిందని అంచనా వేసింది. వేదిక, కేటరింగ్ ఖర్చులు ఏటేటా 10 శాతం చొప్పున పెరగడమే పెళ్లి బడ్జెట్ హెచ్చు అవడానికి మూల కారణమని వెల్లడించింది. జ్యూయలరీ, డెకరేషన్‌కు కూడా బాగానే వ్యయం అవుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చాక ఇప్పుడు పెళ్లి వేడుకకు కోటి రూపాయలు ఖర్చు సాధారణం అయిపోయింది. సెలబ్రిటీల వెడ్డింగ్‌ల ప్రభావం కూడా దీనిపై ఉంది. తమ పెళ్లి వేడుక లాంటిది మరొకటి ఉండకూడదని కూడా భావిస్తూ జంటలు ఖర్చుకు వెనుకాడటంలేదు. ‘‘ఎంత వీలైతే అంత గొప్పగా వివాహ వేడుక చేసుకోవాలని అంతా భావిస్తున్నారు. వేదికకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. దాని తర్వాత కేటరింగ్‌కు, మంచి వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు కొనడానికి, పిల్లలకు ఘనంగా పెళ్లి చేయడానికే తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు’’ అని టైలర్‌మేడ్‌ఎక్స్‌పీరియన్స్ అనే సంస్థ ఫౌండర్ శంశాక్ గుప్తా తెలిపారు. ‘‘ప్రస్తుతం వివాహం స్వభావం మారిపోయింది. పెళ్లిళ్లలో చిందులకు జెనరేషన్ జెడ్ తరం జంటలు మక్కువ చూపుతున్నాయి. రెస్టారెంట్లపైన కాక్‌టైల్ పార్టీలా పెళ్లి వేడుకను మార్చేస్తున్నారు. థీమ్‌డ్ వెల్‌కం డిన్నర్లను చూస్తే పాశ్చాత్య ప్రభావం మన వాళ్లపైన ఎలా ఉందో తెలుస్తోంది’’ అని వెడ్‌మీగుడ్ కోఫౌండర్ మెహెక్ సాగర్ సహానీ అన్నారు.
రెండు నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు
వివాహాల బడ్జెట్ పెరగడంతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ప్రత్యేకమైన కేటరింగ్ చేసే వారికి, ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో సుమారు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్(సీఏఐటీ) అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా సుమారు రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని లెక్కలుగట్టింది.
సెలబ్రిటీల వివాహ ఖర్చు ఇలా..
ఇషా అంబానీ, ఆనంద్ పిరామిల్: రూ. 700 కోట్లు
సుశాంతో రాయ్, సీమంతో రాయ్: రూ. 554 కోట్లు
బ్రాహ్మణిరెడ్డి, రాజీవ్ రెడ్డి: రూ. 500 కోట్లు
శృష్టి మిత్తల్, గుల్‌రాజ్ బెహల్: రూ. 500 కోట్లు
వనిశా మిత్తల్, అమిత్ భాటియా: రూ. 240 కోట్లు
సోనమ్ వశ్వానీ, నవీన్ ఫాబియానీ: రూ.210 కోట్లు
విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ: రూ. 100 కోట్లు
అదెల్ సజన్, సనా ఖాన్: రూ. 100 కోట్లు
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్: రూ. 77 కోట్లు
అధ్యయన వివరాలు ఇవీ..
సర్వేలో పాల్గొన్న జంటలు: 3,500
కోటి కన్నా ఎక్కువ ఖర్చు చేస్తామన్న వారు: 9%
50 లక్షల నుంచి రూ. కోటి ఖర్చు : 9%
15 లక్షల కన్నా తక్కువ చేస్తామన్నవారు: 40%
15 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఖర్చు చేస్తామన్నవారు: 19%
25 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తామన్నవారు: 23%
పెళ్లికి వ్యక్తిగత, కుటుంబ సేవింగ్స్ మాత్రమే ఖర్చు చేస్తామన్నవారు: 82%
లోన్లు తీసుకుంటామన్నవారు: 12%
ఆస్తులు అమ్మి పెళ్లి చేసుకుంటాం అన్నవారు:6%