Share News

Delhi: అర్మేనియాకు ఆయుధాలిస్తే ఊరుకోం..

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:01 AM

అర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేస్తే చూస్తూ ఊరుకోబోమని అజర్‌బైజాన్‌ దేశం భారత్‌ను హెచ్చరించింది. ఫ్రాన్స్‌, గ్రీస్‌ దేశాలను ఉద్దేశించి కూడా ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసింది.

Delhi: అర్మేనియాకు ఆయుధాలిస్తే ఊరుకోం..

భారత్‌కు అజర్‌బైజాన్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: అర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేస్తే చూస్తూ ఊరుకోబోమని అజర్‌బైజాన్‌ దేశం భారత్‌ను హెచ్చరించింది. ఫ్రాన్స్‌, గ్రీస్‌ దేశాలను ఉద్దేశించి కూడా ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారత్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంపై అర్మేనియా ఆసక్తి చూపుతోంది. భారత్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో ఉంది. బ్రహ్మోస్‌ క్రూయజ్‌ క్షిపణులు కొనుగోలు చేయడంపైనా ఆసక్తి చూపుతోంది.


‘పినాక’ మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంఛర్లు కొనుగోలు చేయడానికి 2022లో ఒప్పందం కుదిరింది. పినాక రాకెట్‌ లాంఛర్లను కొనుగోలు చేసిన తొలి దేశం కూడా అర్మేనియాయే కావడం గమనార్హం. అర్మేనియాకు ఆయుధాలు సరఫరాను భారత్‌ చాలా కాలం రహస్యంగానే ఉంచింది. అయితే కొన్ని కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో అమ్మకాల వివరాలను పేర్కొనడం తప్పనిసరి కావడంతో అవి బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ సంస్థ అర్మేనియాకు 41.5 మిలియన్‌ డాలర్లు (రూ.345 కోట్లు)విలువ చేసే యాంటీ డ్రోన్‌ సిస్టంలను సరఫరా చేసింది.

Updated Date - Apr 29 , 2024 | 06:01 AM