West Bengal: సెలవు కోసం దారుణానికి ఒడిగట్టిన విద్యార్థి.. దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు
ABN , Publish Date - Feb 07 , 2024 | 06:56 PM
పశ్చిమ బెంగాల్(West Bengal)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి తనకు సెలవు అవసరం ఉండటంతో చిన్నారిని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి తనకు సెలవు అవసరం ఉండటంతో చిన్నారిని హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురూలియా జిల్లాలోని ఘస్టోరియాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి తనకు సెలవు కావాలనుకున్నాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా సెలవు దొరికే మార్గం కనిపించలేదు. చివరికి పాఠశాలలో ఎవరైనా చనిపోతే సెలవు ఇస్తారని భావించాడు. ఈ క్రమంలో జనవరి 30న ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫిబ్రవరి 1న పాఠశాలకు 400 మీటర్ల దూరంలో ఉన్న చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తొలుత ప్రమాదవశాత్తు నీట మునిగాడని భావించినా పోలీసులకు అతని తలపై గాయం కనిపించింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన 8వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. తనకు సెలవు కావాలనే బాలుడిని కొట్టి చెరువులో పడేసినట్లు ఆ విద్యార్థి తెలిపాడు. ఈ సమాధానంతో షాక్‌కి గురైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి